Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా శంషాబాద్ - విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్‌ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు.
- By Pasha Published Date - 09:20 AM, Thu - 7 November 24

Kurnool to Vizag : ప్రస్తుతం కర్నూలు నుంచి విశాఖపట్నానికి రైలులో వెళ్లడానికి దాదాపు 10 గంటల టైం పడుతోంది. త్వరలో కర్నూలువాసులు కేవలం నాలుగు గంటల్లో వైజాగ్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం కర్నూలు నుంచి అమరావతికి రైలులో వెళ్లడానికి దాదాపు 6 గంటల టైం పడుతోంది. త్వరలో మూడు గంటల్లోనే అమరావతికి చేరుకోవచ్చు. అదెలా అంటే.. కర్నూలు- విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్ అలైన్‌మెంట్ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగా రాయలసీమ ముఖద్వారం కర్నూలు – సాగర నగరం విశాఖ మధ్య కొత్త రైల్వే రూట్ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ రూట్ అందుబాటులోకి వస్తే కర్నూలు ప్రాంతం పారిశ్రామిక, వాణిజ్య పరంగా డెవలప్ అవుతుంది.
Also Read :Puri Jagannath : స్టార్ హీరోతో పూరీ నెక్స్ట్ మూవీ.. మెంటర్ ఎక్కించేందుకు రెడీనా..!
ప్రాజెక్టులో ఎక్కువ భాగం తెలంగాణలోనే..
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా శంషాబాద్ – విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్‌ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి కర్నూలు వయా విజయవాడ, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు మీదుగా కర్నూలుకు మరో రైల్వే కారిడార్‌ను ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్టులో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఎనిమిది రైల్వే స్టేషన్లు ఉండటం గమనార్హం. ఈ ప్రతిపాదిత రైలు మార్గంలో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉంటుంది. కర్నూలు నగరం చెంతనే ఉన్న తుంగభద్రా నది, తెలంగాణలో ప్రవహించే కృష్ణా నదులపై రైల్వే వంతెనలను నిర్మించనున్నారు. సెమీ హైస్పీడ్ కారిడార్‌లో నడిచే రైళ్లు గంటకు 200 కి.మీకు పైగా వేగంతో దూసుకుపోతాయి. అందుకే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా రైల్వే బోర్డుకు నివేదికలు అందించనున్నారు.
Also Read :Adhitya Ram : ప్రభాస్ సినిమాతో నిర్మాణం ఆపేసి.. చరణ్ సినిమాతో మళ్ళీ తెర మీదకు వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!
కర్నూలు జంక్షన్‌గా మారేనా ?
మంత్రాలయం-కర్నూలు వయా ఎమ్మిగనూరు, కోడుమూరు రైలు మార్గం ప్రతిపాదనల్లో ఉంది. దీన్ని నిర్మిస్తే కర్నూలు నుంచి తూర్పుకు సూర్యపేట, విజయవాడ సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్.. పడమర వైపునకు కర్నూలు-మంత్రాలయం వయా ఎమ్మిగనూరు.. ఉత్తర వైపునకు కర్నూలు – హైదరాబాద్ వయా గద్వాల, మహబూబ్‌నగర్.. దక్షిణం వైపునకు కర్నూలు – బెంగళూరు వయా డోన్, గుత్తి రైల్వేలైన్లు సాగిపోతాయి. నాలుగు వైపులా రైలు మార్గాలతో కర్నూలు జంక్షన్‌గా మారే అవకాశం ఉంది.