Ration Rice Case : మాజీమంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్నినాని చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
- By Latha Suma Published Date - 12:53 PM, Tue - 31 December 24

Ration Rice Case : గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు ఏ-6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్నినాని చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలియడంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రైస్ గోదాం నుంచి మాయమైన బియ్యం కేసులో పేర్నినాని భార్య జయసుధను ఏ1 కేసు నమోదు చేయగా కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురికి నిన్న రాత్రి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. నిందితులుగా ఉన్న మేనేజర్ మానస తేజ్‌ను, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జడ్జి వారికి రిమాండ్ విధించారు.
ఇకపోతే..పేర్ని నాని భార్య జయసుధకు నిన్న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా బందరు మండలం పోట్లపాలెంలో సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు. వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ తొలుత పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.