Bonda Uma vs Pawan Kalyan : అంబటికి ఛాన్స్ ఇస్తున్న జనసేన శ్రేణులు
Bonda Uma vs Pawan Kalyan : అసెంబ్లీలో పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య నియంత్రణపై ప్రశ్నల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువయ్యాయి
- By Sudheer Published Date - 11:15 AM, Mon - 22 September 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా బోండా ఉమా – పవన్ కళ్యాణ్ Bonda Uma vs Pawan Kalyan వివాదం చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య నియంత్రణపై ప్రశ్నల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ స్పందన సరైన విధంగా లేదని, తాను సమస్య చెప్పినా శాఖ మంత్రి కూడా అందుబాటులో లేరన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇది వినగానే పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా స్పందిస్తూ, తమ ప్రభుత్వం రాగానే బోర్డులో మార్పులు జరిగాయని, ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయగల వాతావరణం కల్పించామని చెప్పారు. అలాగే తక్షణ చర్యలు తీసుకుంటే కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లే ప్రమాదం ఉందని వివరించారు. ఈ జవాబు సాధారణంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద వివాదం రేగింది.
Superwood: ఉక్కును మించిన సూపర్‌వుడ్.. భవిష్యత్ నిర్మాణాలకు కొత్త దారిదీపం
జనసేన శ్రేణులు బోండా ఉమా వ్యాఖ్యలను తమ నాయకుడిని టార్గెట్ చేసినట్లుగా భావించి సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఎక్స్ (Twitter) లో పోస్ట్‌లు, కామెంట్లు మరింత కఠినతరమయ్యాయి. ఈ వివాదంలో కొందరు చంద్రబాబు గత జైలు జీవితాన్నీ లాగి తెచ్చారు. దీంతో రెండు పార్టీల అగ్ర నాయకత్వం అప్రమత్తమై, సమస్యను అదుపు చేయడానికి ముందుకు వచ్చింది. వెంటనే బోండా ఉమా వరుస ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించడం ప్రారంభించారు. ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం గర్వంగా ఉందని, సమస్యలు పరిష్కారం కావడానికి తక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పారు. దీని ద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపించింది.
అయితే ఈ వివాదంలోకి వైసీపీ కూడా ప్రవేశించి మరింత మంట పెట్టె ప్రయత్నం చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని ఏకంగా కూటమి ఎమ్మెల్యేనే ఆరోపించారని వ్యాఖ్యానించారు. దీంతో మళ్లీ వివాదం ముదురుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ రాజకీయ పర్యవేక్షకుల అభిప్రాయం ప్రకారం, ఒక సాధారణమైన ప్రశ్న-జవాబు ప్రక్రియను అభిమానులు అతిగా రియాక్ట్ చేయడం వల్లే ఈ వివాదం పెద్దది అయిందని అంచనా వేస్తున్నారు. ఇది కూటమిలో విభేదాలుగా ముదరకుండా, పరస్పర అవగాహనతో పరిష్కారం కానుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.