Superwood: ఉక్కును మించిన సూపర్‌వుడ్.. భవిష్యత్ నిర్మాణాలకు కొత్త దారిదీపం
ఈ పరిశోధన ఆధారంగా InventWood అనే స్టార్టప్ ఏర్పడింది. ఈ కంపెనీ ఇప్పటికే 50 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సేకరించి, మేరీల్యాండ్‌లోనే ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది.
- By Dinesh Akula Published Date - 06:15 AM, Mon - 22 September 25

మేరీల్యాండ్, అమెరికా: Superwood- భవన నిర్మాణ రంగాన్ని శాశ్వతంగా మార్చగల ఓ విప్లవాత్మక ఆవిష్కరణ సూపర్‌వుడ్ (Superwood) ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఉక్కు కంటే పదింతలు బలంగా, ఆరింతలు తేలికగా ఉండే ఈ అద్భుతమైన మెటీరియల్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ సాంకేతికతకు మూలం ప్రొఫెసర్ లియాంగ్‌బింగ్ హు నేతృత్వంలో 2013–2018 మధ్య జరిగిన పరిశోధన. సహజ చెక్కలోని లిగ్నిన్, హీమిసెల్లులోజ్ వంటి తక్కువ బలమైన భాగాలను తొలగించి, దాన్ని అధిక వేడి, పీడనంతో నొక్కితే — చెక్క అసాధారణ బలంతో మారుతుందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్‌ను 2018లో Nature జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధన ఆధారంగా InventWood అనే స్టార్టప్ ఏర్పడింది. ఈ కంపెనీ ఇప్పటికే 50 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సేకరించి, మేరీల్యాండ్‌లోనే ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ కంపెనీ తయారు చేసిన ఫసాడ్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులు 2025 మధ్య నాటికి మార్కెట్లోకి రానున్నాయి.
సూపర్‌వుడ్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
ఉక్కు కంటే పది రెట్లు బలంగా, ఆరింత తేలికగా ఉంటుంది
Class A Fire Rating కలిగి ఉండటంతో, అగ్నికి తట్టుకునే శక్తి
నీరు, కుళ్లు, పురుగులు ఎటువంటి నష్టం కలిగించలేవు
ఉక్కుతో పోలిస్తే తయారీలో 90% తక్కువ కాలుష్యం
కార్బన్‌ను నిల్వ చేసుకునే బయోజెనిక్ మెటీరియల్ కావడం
నిర్మాణాల్లో ఉపయోగిస్తే, రవాణా ఖర్చులు, నిర్మాణ సమయం తగ్గింపు
ఈ సూపర్‌వుడ్ వాడకం ద్వారా భవిష్యత్‌లో పర్యావరణానికి హాని కలగకుండా వుడ్ స్కైస్క్రేపర్లు నిర్మించే అవకాశం ఉంది. ఇది కేవలం ఓ కొత్త పదార్థం మాత్రమే కాకుండా, పర్యావరణహిత, స్థిరమైన నిర్మాణ రంగానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది.