Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
- By Kavya Krishna Published Date - 02:19 PM, Fri - 20 June 25

Bhanuprakash Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “ఒక శవం లేవాలి, వస్తే రెండు శవాలు లేవాలి” అనే జాతి చీల్చే మాటలు మాట్లాడిన నేతగా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.
వైసీపీ నేతలపై భానుప్రకాశ్ ఘాటుగా స్పందించారు. “గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన ఘనులు వీళ్లు. కొబ్బరి బోండాలు నరుక్కోవడానికే, పరోటా పిండి పిసికేందుకు వీరి మిగిలిన జీవితం సరిపోతుంది,” అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా ఇప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్‌డీఏ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నా, కూటమి అధికారంలోకి వచ్చి 40 రోజుల్లోనే వారు ఢిల్లీలో రచ్చ చేసి ఏమీ సాధించలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అపోహలు కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజలు జగన్‌ను తిరస్కరించారని, అతడు రాజకీయాలకు అనర్హుడని భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అలాగే, జగన్‌ను నమ్మిన నేతలు ఇప్పుడు వైసీపీ నుంచి నిష్క్రమిస్తున్నారని, పార్టీకి ఇక జైలు యాత్రలు తప్ప విజయాలు కనిపించవని ఎద్దేవా చేశారు. మానసిక స్థిరత్వం కోల్పోయినట్టు జగన్ వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష హోదా కోసం చిన్నపిల్లల చాక్లెట్ల మాదిరిగా మొర పెట్టుకుంటున్నారని అన్నారు.
పోలీసులపై కూడా భానుప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ, రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని అతిక్రమించేవారిని తక్షణమే అరెస్టు చేయాలని సూచించారు. కేంద్రం రాష్ట్రానికి అన్నివిధాలా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
10th Fail: తెలుగు రాష్ట్రాల్లో 10, 12 తరగతుల ఫెయిల్యూర్ రేట్లపై కేంద్రం ఆందోళన