Chandrababu : కుప్పంలో మహిళ పై దాడి ..సీఎం ఆగ్రహం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
వాదన హద్దులు దాటి, వారు శిరీషను ఒక చెట్టుకు కట్టేసి శారీరకంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విముక్తి చేశారు.
- By Latha Suma Published Date - 10:28 AM, Tue - 17 June 25

Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని నారాయణపురం గ్రామంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. బాధితురాలి పట్ల న్యాయంగా వ్యవహరించలేదని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో తిమ్మరాయప్ప ఊరిని వదిలి వెళ్లిపోయాడు.
Shocking ! In CM #ChandrababuNaidu's own constituency Kuppam an alleged #TDP worker tied a 25-year-old woman to a tree and publicly humiliated her over an unpaid loan of ₹80,000. Victim Sirisha has been raising her two children on her own since her husband abandoned them. After… pic.twitter.com/UI0Xft63Lh
— Ashish (@KP_Aashish) June 17, 2025
అయితే, అతని భార్య శిరీష తన పుట్టింటైన శాంతిపురం మండలం కెంచనబల్ల గ్రామంలో ఉంటూ, జీవనోపాధి కోసం బెంగళూరులో కూలిపనులు చేస్తూ కుమారుడిని పోషిస్తున్నారు. ఈ క్రమంలో శిరీష తన కుమారుడి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) తీసుకోవడానికి సోమవారం నారాయణపురంలోని పాఠశాలకు వచ్చారు. ఇదే సమయంలో అప్పు ఇచ్చిన మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి కలిసి శిరీషను అడ్డగించారు. ఆమె భర్త తీసుకున్న అప్పు చెల్లించాలంటూ వాగ్వాదానికి దిగారు. వాదన హద్దులు దాటి, వారు శిరీషను ఒక చెట్టుకు కట్టేసి శారీరకంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విముక్తి చేశారు. శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సీఎంతో మాట్లాడారు. నిందితులలో ఓ వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
మిగిలిన నిందితులను కూడా త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలలో భయాందోళనలు లేకుండా, న్యాయసంస్థలపై నమ్మకం పెరగాలంటే ఇలాంటి నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఈ అమానవీయ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు ప్రజలు, మహిళా సంఘాలు సంఘీభావం తెలిపే విధంగా స్పందిస్తున్నాయి.