Asias Longest Tunnel : ఆసియాలోనే పొడవైన నీటిపారుదల సొరంగాలు రెడీ
Asias Longest Tunnel : ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయింది.
- By Pasha Published Date - 09:09 AM, Wed - 24 January 24

Asias Longest Tunnel : ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్దదోర్నాల మండలంలో రెండో సొరంగం తవ్వకం పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి సొరంగం తవ్వకం పనులు 2021 జనవరి 13న కంప్లీట్ అయ్యాయి. రెండో సొరంగం తవ్వకం పనులు తాజాగా మంగళవారం పూర్తయ్యాయి. 2019 మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులను మంగళవారం పూర్తి చేశామని ఇంజినీర్లు ప్రకటించారు. దీంతో ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను(Asias Longest Tunnel) పూర్తి చేసిన ఘనత తమ కంపెనీకి దక్కిందన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలో ఉన్న కొల్లం వాగు వరకు 18.8 కి.మీల మేర రెండు టన్నెల్స్‌ను తవ్వారు. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నుంచి ప్రతీ వర్షాకాలం సీజన్‌లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే.. వెలిగొండ ప్రాజెక్టులోని రెండు సొరంగాల ద్వారా నీటిని నల్లమల సాగర్‌కు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.
Also Read :Data Leak : చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. యూజర్ల 2600 కోట్ల రికార్డులు చోరీ
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 56 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావంవల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తిచేయించారు. రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో.. 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి 7.698 కి.మీల పొడవున రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు.