Trump Vs Biden : ‘బైడెన్ 81’ వర్సెస్ ‘ట్రంప్ 77’.. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజ
Trump Vs Biden : రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లైన్ క్లియర్ అయింది.
- By Pasha Published Date - 08:02 AM, Wed - 24 January 24

Trump Vs Biden : రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లైన్ క్లియర్ అయింది. తాజాగా న్యూ హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించారు. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ రెండో స్థానంలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌కు 53.8 శాత మేర ఓట్లు పోల్ అయ్యాయి. ఆయనకు మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతం పోలింగ్‌తో నిక్కీ హేలీ 36,083 ఓట్లను సాధించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ట్రంప్ ఆధిక్యం ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. రాన్ డీశాంటీస్‌కు 21.4 శాతం ఓట్లు, నిక్కీ హేలీకి 17.7 శాతం ఓట్లు, భారత సంతతి నేత వివేక్ రామస్వామికి 7.2 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలను బట్టి అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల రిపబ్లికన్ పార్టీ శ్రేణులన్నీ ట్రంప్ వెనుకే ఉన్నాయనే విషయం క్లియర్ అయింది. దీంతో వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తరువాతి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ..
ఈదఫా మూడోసారి ట్రంప్ తన లక్కును పరీక్షించుకోనున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేయడం(Trump Vs Biden) దాదాపు ఖాయం. బైడెన్ వయసు 81 ఏళ్లు, ట్రంప్ వయసు 77 ఏళ్లు. ఈ ఇద్దరు వృద్ధ సింహాలే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నారు. ట్రంప్‌పై అనేక నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ఆయనపైనే అమెరికా ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారు. దీంతో ఇప్పటికే వివేక్ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. వీరిలో రామస్వామి, డిశాంటిస్‌లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. క్రిస్టీ మాత్రం మొదటి నుంచి ట్రంప్‌ను వ్యతిరేకించినందున ఆయన మద్దతుదారులు నిక్కీ హేలీ వైపు మొగ్గవచ్చు. కాగా, న్యూ హ్యాంప్‌షైర్‌లోని కుగ్రామం డిక్స్ విల్‌నాచ్‌లో మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హేలీయే గెలుపొందారు. ఆ గ్రామంలోని మొత్తం ఆరుగురు ఓటర్లు హేలీకే ఓటు వేశారు. వీరిలో నలుగురు రిపబ్లికన్ పార్టీ ఓటర్లుగా నమోదవగా, మిగిలిన ఇద్దరు తటస్థ ఓటర్లు. ఆరుగురు ఓటర్ల పోలింగ్ ప్రక్రియ కవరేజీకి 60 మందికి పైగా విలేకరులు హాజరవడం గమనార్హం.