జగన్‌కు మంత్రి సవాల్.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాలని!
పీపీపీ వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ ఒక కోటి సంతకాలను సమర్పించామని జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఆ సంతకాలన్నీ నకిలీవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఇలా చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది.
- Author : Gopichand
Date : 19-12-2025 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
- వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
- పీపీపీ అక్రమమైతే జైలుకు పంపమన్న మంత్రి
Satya Kumar Dares Jagan: ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) నమూనాలో వైద్య కళాశాలల అభివృద్ధిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే పీపీపీ ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న కాంట్రాక్టర్లను జైలుకు పంపుతామని జగన్ హెచ్చరించడంపై సత్యకుమార్ స్పందిస్తూ.. ఇటువంటి ప్రకటనలు రాజకీయ అహంకారాన్ని, బాధ్యతారహితమైన మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడరని, పీపీపీ మోడల్ అక్రమమైతే ముందు తనను అరెస్టు చేయాలని ఆయన జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు.
పీపీపీ విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టినది కాదని.. ఎన్డీయే ప్రభుత్వం, నీతి ఆయోగ్, నేషనల్ మెడికల్ కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, చివరకు కోర్టులు కూడా ఆమోదించిన జాతీయ స్థాయి నమూనా అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సంస్థలన్నింటినీ తప్పు పట్టడానికి జగన్ సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని, ఫీజులు, అడ్మిషన్లు, రిజర్వేషన్లపై ప్రభుత్వానికే పూర్తి నియంత్రణ ఉంటుందని సత్యకుమార్ వివరించారు.
Also Read: టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంకకు కొత్త కెప్టెన్!
పీపీపీ వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ ఒక కోటి సంతకాలను సమర్పించామని జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఆ సంతకాలన్నీ నకిలీవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఇలా చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ సీట్లు వేగంగా పెరుగుతాయని, పేద విద్యార్థులకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రులు వాదించారు. ఇరుపక్షాలు తమ పట్టు వీడకపోవడంతో, ఈ అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ ఘర్షణగా మారింది.