Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు
Fake Alcohol : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయ విధానంపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది
- By Sudheer Published Date - 09:45 AM, Sun - 12 October 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయ విధానంపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. మద్యం విక్రయాలలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేయగల విధానం రూపొందించారు. దీని ద్వారా ఆ బాటిల్ అసలైనదా, నకిలీదా అనేది వినియోగదారుడు నేరుగా తెలుసుకోవచ్చు. ఇది మద్యం అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తుల తయారీని అడ్డుకునేందుకు కీలక సాధనంగా మారనుంది.
Food: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!
సమీక్ష సమావేశంలో అధికారులు వివరించినట్లు, గత కొన్నేళ్లలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఉత్పత్తులు పెరిగి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా మారాయి. ఈ నకిలీ మద్యం తయారీలో కొందరు రాజకీయ నాయకులు కూడా ప్రమేయం ఉన్నట్లు తేలిందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ, “గత ప్రభుత్వం నకిలీ మద్యం మాఫియాలను ప్రోత్సహించి ప్రజల ప్రాణాలతో ఆటలాడింది” అని విమర్శించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలకు ఎటువంటి సహనం ఉండబోదని స్పష్టం చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నకిలీ మద్యం వ్యవహారంలో పాల్గొన్న కొందరు టీడీపీ నేతలను ఇప్పటికే సస్పెండ్ చేశారు. మద్యం సరఫరా శ్రేణిలో ఎక్కడా అవకతవకలు జరగకుండా కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కొత్త యాప్ ద్వారా మద్యం సీసాలపై QR కోడ్, హోలోగ్రామ్‌లు స్కాన్ చేసి అసలుదనం నిర్ధారించగల ఈ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఈ చర్యతో మద్యం వ్యాపారంలో పారదర్శకత పెరగడం మాత్రమే కాకుండా, ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు కూడా ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.