AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీలు మూసివేయబడతాయి.
- By Dinesh Akula Published Date - 10:41 PM, Sun - 26 October 25
విశాఖపట్నం, అక్టోబర్ 26: (AP Schools Closed:) మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో, తుపాను ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు మరియు విద్యాసంస్థలను మూసివేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీలు మూసివేయబడతాయి. అదే విధంగా, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆయన హెచ్చరిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి స్కూల్స్ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో కూడా అక్టోబర్ 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుపాను కారణంగా కలెక్టరేట్, రెవెన్యూ శాఖల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఈదురుగాలులు, భారీ వర్షాలతో వరిపంట నష్టపోవచ్చనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు. అక్టోబర్ 26 నుండి 29 వరకు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దని సూచిస్తూ, తీరప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరించారు. బీచ్‌లు మరియు పర్యాటక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజా రక్షణ చర్యల్లో భాగంగా అక్టోబర్ 27న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.