Jammu Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
- By Latha Suma Published Date - 12:29 PM, Tue - 21 January 25

Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు. ఆదివారం రాత్రి సోపోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలూర గుజ్జర్ పటి ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
జవాన్ కార్తీక్ (29) వరదరాజులు, సెల్వి దంపతుల చిన్న కుమారుడు. డిగ్రీ చదువుకుంటూ ఆర్మీలో 2017 లో చేరారు. దీపావళీ పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లాడు. ఇంతలో ఈ వార్త ఆయన కుటుంబంలో విషాదం నింపింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్తీక్ మృతితో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గ్రామానికి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాగా, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరజవాన్ కార్తీక్ త్యాగానికి చినార్ కార్ప్స్ అన్ని ర్యాంకులు వందనాలు అర్పిస్తున్నాయి. చినార్ వారియర్స్ అతని అపారమైన పరాక్రమం, త్యాగానికి సెల్యూట్ చేస్తూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మృతుని కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నట్లు భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. కార్తీక్ మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకోనుంది. కుటుంబ సభ్యులో ఈరోజే అంత్యక్రియలు నిర్వహిస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయన త్యాగం మరువలేనిదంటూ గ్రామస్తులు, కార్తీక్ స్నేహితులు పెద్ద ఎత్తున నివాళులర్పిస్తున్నారు.
మరోవైపు జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.