Pensions for Childrens : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పిల్లలకు పింఛన్లు
Pensions for Childrens : మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- By Kavya Krishna Published Date - 03:57 PM, Thu - 12 December 24

Pensions for Childrens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పింఛన్లను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల వివరాలను వచ్చే మూడు నెలల్లో సేకరించి, వారికి పింఛన్లను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రతి సంవత్సరం ఈ జాబితాను సరిచేసి అప్డేట్ చేయాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.
అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా, పింఛన్ల విషయంలో అనర్హులకు ఆర్థిక సాయం అందుతున్నాయనే ఫిర్యాదులు వెలుగు చూశాయని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు హడావుడిగా 6 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినప్పటికీ, వారిలో చాలా మంది అనర్హులుగా తేలారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇక, వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పింఛన్‌ను తిరిగి పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులకు సంబంధించి ధృవీకరణ పత్రాలను కచ్చితంగా పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు.
‘రాష్ట్రమే ఫస్ట్… ప్రజలే ఫైనల్’ నినాదం
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినట్లు గుర్తుచేశారు. గత ఐదేళ్లలో సంక్షోభాలతో ఉన్న రాష్ట్రం, అప్పుల భారంతో అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సంక్షోభాలను అవకాశాలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
చంద్రబాబు మాటల్లో:
“సంక్షోభం కంటే సంక్షేమం, పబ్లిసిటీ కంటే రియాలిటీ మాకు ముఖ్యం. ‘రాష్ట్రమే ఫస్ట్… ప్రజలే ఫైనల్’ అనే విధానంతో రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రజల ఆశీస్సులు, సహకారంతో స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడతాం.”
మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందిస్తూ, ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రజల భవిష్యత్‌కు పునాదులు వేయడం, స్వర్ణాంధ్ర ఆవిర్భావానికి మార్గదర్శకత్వం ఇవ్వడం అని తెలిపారు. ‘గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దాం, అభివృద్ధి పథంలో వేగంగా ప్రయాణిద్దాం’ అనే ఉద్దేశ్యంతో ప్రతి క్షణం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ అవుతుందని, పబ్లిసిటీ కంటే కార్యచరణకే ప్రాముఖ్యత ఇస్తుందని, ఈ నిర్ణయాలు మళ్ళీ నిరూపిస్తున్నాయి.
Read Also : Saraswati Lands : ‘సరస్వతి’ భూముల విషయాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం