AP Budget Session : ‘చంద్రబాబు’ లేకుండానే ఏపీ బడ్జెట్ సెషన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చ్ ఫస్ట్ వీక్ లో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 4న లేదంటే... 7వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ను ప్రారంభించి, నెలాఖరు వరకు నిర్వహించే చాన్స్ కనిపిస్తోంది
- By Hashtag U Published Date - 11:27 AM, Wed - 9 February 22

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చ్ ఫస్ట్ వీక్ లో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 4న లేదంటే… 7వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ను ప్రారంభించి, నెలాఖరు వరకు నిర్వహించే చాన్స్ కనిపిస్తోంది. అప్పటి కరోనా పరిస్థితులను బట్టి మూడు లేదా నాలుగు వారాలు పాటు సమావేశాలను నిర్వహించనున్నారని సమాచారం. గత వారంతో పోలిస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే మార్చి మొదటి వారంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలోనే అసెంబ్లీ సెషన్స్ ను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది నిర్ణయించనున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో… అందులో రాష్ట్రానికి వచ్చిన కొద్దోగొప్పో కేటాయింపులను బేరీజు వేసుకుని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలపై కసరత్తు చేస్తున్నారు. దాదాపు బడ్జెట్ కసరత్తు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిన నేపధ్యంలో… ఈసారి ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టే బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్ధిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనపై మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కు అన్ని విషయాలను వివరించారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం బడ్జెట్ పైనే కాకుండా కొన్ని కీలక అంశాలపైనా జగన్ సర్కార్ దృష్టి సారించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకువచ్చే పరిపాలనా వికేంద్రీకరణ (మూడు రాజధానులు) బిల్లు పై అందరి చూపు ఉంది. గత సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్న సందర్భంలో మెరుగైన బిల్లును తీసుకువస్తామని ఏపీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో కొత్త బిల్లులను ప్రభుత్వం తీసుకువస్తుందా..? లేదంటే… మూడు రాజధానుల బిల్లులో ఏమైనా మార్పులు, చేర్పులు చేసి తీసుకువస్తుందా అనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. అలానే కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించిన అంశం కూడా ఈసారి శాసన సభ సమావేశాల్లో కీలకంగా మారనుంది.
ఇంకోవైపు చూస్తే… ఉగాది నాటికి కొత్త జిల్లాలలో పరిపాలనను ప్రారంభించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీంతో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో… ఏపీ న్యూ డిస్ట్రిక్ట్స్ బిల్లుకు శాసన సభ ఆమోదం పొందడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మళ్లీ సీఎం ని అయితే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనని శపధం చేసిన ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరుకాకపోవచ్చు. సో… చంద్రబాబు ఎలానూ అసెంబ్లీ సెషన్స్ కు అటెండ్ కారు కాబట్టి, ఆ పార్టీ సభ్యులు మాత్రం సమావేశాలకు హజరై, జగన్ సర్కార్ ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులపై జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని నిలదీసే చాన్స్ ఉంది. ఏది ఏమైనా కూడా ఈసారి జరగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది.