AP Assembly PAC Chairman Post: వైసీపీకి మరో షాక్ తప్పదా? పీఏసీ ఛైర్మన్ పదవి దక్కేనా?
ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు ఎదురవుతుండగా, పీఏసీ ఛైర్మన్ పదవిపై చర్చ ఉత్కంఠను రేపుతోంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నామినేషన్లకు ఇవాళ మధ్నాహ్నం వరకు సమయం ఉంది.
- Author : Kode Mohan Sai
Date : 21-11-2024 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
AP Assembly PAC Chairman Post: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది, దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తాము ప్రతిపక్ష హోదా పొందాలని, స్పీకర్ ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే, జగన్‌తో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు.
ఈ క్రమంలో, అసెంబ్లీలో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ పదవిపై చర్చ మొదలైంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. దీనిపై చర్చ జరుగుతున్నది, వైఎస్సార్‌సీపీకి ఈ పదవి దక్కుతుందా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు.
రాష్ట్రంలో కీలకమైన ఈ పీఏసీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీకి దక్కాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ పార్టీకి ప్రస్తుతం కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో, పీఏసీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని చర్చలు సాగుతున్నాయి.
ఏపీ అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అవసరమైతే, ఎన్నిక కూడా నిర్వహించబడుతుంది. ఈ పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు, అందులో 9 మంది శాసనసభ నుంచి, 3 మంది మండలి నుంచి ఎంపిక చేయబడతారు. శాసనసభ నుంచి ఛైర్మన్‌ను నియమించడానికి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.
గత ప్రభుత్వంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు ఎంపికవ్వగల బలం ఉండటంతో, పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌కి అవకాశం దక్కింది. సంప్రదాయం ప్రకారం, స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఈ పదవిని ఇస్తారు. అయితే, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ బలాన్ని బట్టి చూస్తే, ఒక్క సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది, ఈ నేపథ్యంలో పీఏసీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అనే చర్చ జరుగుతోంది.
ఈ పదవి వైఎస్సార్‌సీపీకి దక్కకపోతే, జనసేన నుంచి ఎవరికి దక్కుతుందా అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు అందరికి ఆసక్తి కరంగా మారింది.