Vidadala Rajani ఏపీ కేబినెట్ లో ‘తెలంగాణ ఆడపడుచు’
సాధించగలను అన్న నమ్మకమే మనిషికి కొండంత బలాన్ని ఇస్తుంది.
- By Hashtag U Published Date - 11:12 AM, Wed - 13 April 22

సాధించగలను అన్న నమ్మకమే మనిషికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ కోవలోకే వస్తారు విడదల రజని. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆమె ఎక్కడివారు అన్న చర్చ మొదలైంది. ఆమె నేపథ్యం తెలంగాణతో ముడిపడి ఉంది. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామస్థురాలు. రాగుల సత్తయ్య రెండో కూతురే విడదల రజని. తమ ఊరి బిడ్డ ఆంధ్రప్రదేశ్ లో మంత్రి అవ్వడంతో కొండాపురం గ్రామం ఆనందంలో మునిగిపోయింది. సత్తయ్య దాదాపు 40 ఏళ్ల కిందటే బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలస వెళ్లారు. ఇప్పుడు సఫిల్ గూడలో నివాసం ఉంటున్నారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో రెండో కుమార్తె విడదల రజని. కొంతకాలం కిందట ఆమెకు ఏపీకి చెందిన వ్యాపారవేత్త కుమారస్వామితో వివాహం జరిగింది. విడదల రజని హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో ఉన్న సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ చదివారు. తరువాత ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. తరువాత ఆమె అమెరికా వెళ్లిపోవడంతో ఇక అక్కడే స్థిరపడతారనుకున్నారు. కానీ జన్మభూమికి సేవ చేయాలన్న సత్సంకల్పంతో అమెరికా నుంచి తిరిగి వచ్చేశారు. భర్త ప్రోత్సాహంలో సేవాకార్యక్రమాలు మొదలుపెట్టారు.
చిలకలూరిపేటలో వీఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించి సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. తరువాత 2014లో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా పసుపుజెండా భుజాన మోసారు. 2019లో చిలకలూరిపేట నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకున్నారు. కానీ అక్కడ ప్రత్తిపాటికే టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో 2018లో ఆమె వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ తరపున చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే పోటీ చేసి 8,301 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు ఏపీలో జగన్ క్యాబినెట్ లో మంత్రి అవ్వడంతో.. విడదల రజని రాజకీయంగా మరో మెట్టు ఎక్కినట్టయ్యింది. అలా తెలంగాణ ఆడపడుచు.. 32 ఏళ్లకే ఏపీలో మంత్రిగా సేవలు అందిస్తున్నారు.