AP Formation Day: నిరాడంబరంగా ఏపీ అవతరణ వేడుకలు
నిరాడంబరంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఏపీ వ్యాప్తంగా జరుపుకున్నారు.
- By CS Rao Published Date - 12:44 PM, Tue - 1 November 22

నిరాడంబరంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఏపీ వ్యాప్తంగా జరుపుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనూ వేడుకలను నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ముందుగా అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు.
మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2022
వైసీపీ ప్రభుత్వం అధికారికంగా నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరుపుకోవాలని నిర్ణయించిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారిక ప్రాంగణాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్ లక్ష్మీపార్వతి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.