Amaravati JAC: తిరుపతిలో నేడు అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- By Hashtag U Published Date - 06:00 AM, Fri - 17 December 21

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి బైపాస్ మార్గంలోని టయోటా షోరూమ్ సమీపంలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జేఏసీ నాయకులు గురువారం వేదిక వద్ద భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమిపూజలో జేఏసీ నాయకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పువ్వాడ సుధాకర్, రాయపాటి శైలజ, టీడీపీ నేత పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో బహిరంగ సభకు ఏపీ ప్రభుత్వం మొదట అనుమతి ఇవ్వలేదు. దీంతో అమరావతి జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ మేధావుల వేదిక, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభలకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. ఈ నెల 17న తిరుపతి సమీపంలోని దామినీడు గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని తిరుపతి పోలీసులను ఆదేశించారు. 18న తిరుపతిలోని తుడా గ్రౌండ్స్‌లో రాయలసీమ మేధావుల వేదిక బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి లభించింది.