CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ (Capital Region Development Authority) సమావేశం జరిగింది.
- By Kavya Krishna Published Date - 06:46 PM, Mon - 18 August 25

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ (Capital Region Development Authority) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి, కీలక ప్రాజెక్టుల అమలు వంటి అనేక అంశాలపై సమగ్రంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి నారాయణ వివరాలు తెలియజేస్తూ అన్నారు – “రాజధాని ప్రాంతంలో గ్రామ కంఠాల అభివృద్ధి కోసం సీఆర్డీఏ భారీ మొత్తాన్ని మంజూరు చేసింది. మొత్తం 29 గ్రామాల అభివృద్ధికి 904 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో నీటి సరఫరా కోసం 64 కోట్లు, సీవరేజ్ వ్యవస్థకు 110 కోట్లు, రోడ్ల నిర్మాణానికి 300 కోట్లు కేటాయించబోతున్నాం. ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన వెంటనే, రాబోయే పది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం” అని తెలిపారు.
Super Six – Super Hit : కూటమి పాలనలో అభివృద్ధికి అడ్డులేదు.. సంక్షేమానికి తిరుగులేదు
అమరావతి అభివృద్ధిలో పరిశ్రమలకు కూడా పెద్దపీట వేశారు. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఆర్డీఏ, జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ నిర్మాణానికి కూడా ముందడుగు వేసింది. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. రైతులు అస్సైన్ భూముల విలువ తక్కువగా చూపబడుతోందని ఫిర్యాదు చేయడంతో, భూముల పత్రాలలో “అస్సైన్” అనే పదాన్ని తీసేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక అమరావతి నిర్మాణానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే రాజధానిలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తవుతే రాజధాని మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన నిర్ణయాలూ తీసుకోబడ్డాయి. ఎస్సార్ఎం విట్‌కు 2014లో ఇచ్చిన హామీల ప్రకారం చెరో 100 ఎకరాలు కేటాయించాలని సీఆర్డీఏ తేల్చింది.
అమరావతి రాజధానిపై వస్తున్న విమర్శలకు మంత్రి నారాయణ బదులిస్తూ – “రాజధానిపై ఎంత విమర్శలు చేసినా, వచ్చే మార్చి నాటికి అధికారుల ఇళ్ల కేటాయింపులు జరుగుతాయి. రాబోయే మూడేళ్లలో రోడ్లు, ఐకానిక్ భవనాలు అన్నీ పూర్తవుతాయి. ఇది వైసీపీ నాయకులకు కూడా తెలిసిందే. కావాలంటే అమరావతికి వచ్చి ప్రత్యక్షంగా చూడవచ్చు” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వర్షాల కారణంగా కొన్ని పనులు నెమ్మదించాయని ఆయన స్పష్టం చేశారు. “ఐకానిక్ టవర్ చుట్టూ పెద్ద గుంత తవ్వారు, వర్షం పడితే అక్కడ నీళ్లు నిల్వ కాకుండా ఎలా ఉంటాయి? ఇవన్నీ సాధారణ అంశాలే. పనులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు” అని మంత్రి వివరించారు. మొత్తం మీద అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ సమావేశం మరికొన్ని కీలక నిర్ణయాలకు వేదిక కావడంతో, రాజధాని ప్రాజెక్టుకు నూతన ఉత్సాహం లభించినట్లైంది.
JC Prabhakar Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం..