Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది.
- Author : Kavya Krishna
Date : 04-08-2025 - 8:22 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది. ఆ మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది ఆదోనిలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్. ఈ పాఠశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు అంతగా పెరగడంతో, ఏకంగా ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది.
ఇప్పటికే పాఠశాల సామర్థ్యం మేరకు 1,725 మంది విద్యార్థులు చదువుతుండగా, ఈ విద్యా సంవత్సరంలోనే 400 మందికి పైగా కొత్త విద్యార్థులు చేరారు. అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య రెండువేల దాటింది. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు రావడంతో, పాఠశాల యాజమాన్యం ఇకపై కొత్త అడ్మిషన్లు తీసుకోవడం సాధ్యం కాదని ప్రకటించింది. దానికి గుర్తుగా ‘నో అడ్మిషన్’ బోర్డు ప్రదర్శించారు.
ఈ పరిణామంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. “నో అడ్మిషన్ బోర్డు చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది. అడ్మిషన్లు ముగిశాయి అని చెబుతున్నా, ‘మా ఒక్క పిల్లాడినైనా చేర్చుకోండి సార్’ అని తల్లిదండ్రులు బతిమాలుతున్నారని ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ చెప్పడం ప్రభుత్వ విద్యకు దక్కిన గౌరవానికి నిదర్శనం,” అని లోకేశ్ అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్‌తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మంత్రి లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి బోర్డులు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనిపించాలని ఆశిస్తున్నాను,” అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగించడం ద్వారా ఉపాధ్యాయులే నిజమైన మార్పు తీసుకువస్తున్నారని, వారే ‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్’ను తీర్చిదిద్దే రథసారథులు అని కొనియాడారు.
ఈ సంఘటన ప్రభుత్వ విద్య వ్యవస్థలో వచ్చిన సానుకూల మార్పుకు స్పష్టమైన సూచికగా నిలుస్తోంది. ఒకప్పుడు పాఠశాలల్లో సీట్లు నింపడం కష్టమైపోయిన స్థితి నుంచి, ఇప్పుడు సీట్లు దొరకడం కష్టమైపోయే స్థాయికి చేరుకోవడం – ఇది ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకానికి ప్రతీక.
Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి