Visakha Corporation: పన్నులు చెల్లించకపోతే సంక్షేమపథం కట్
ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్నుల విధానం అక్కడ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బూచి చూపుతూ చెత్త, మరుగుదొడ్లు, ఆస్థి మూలాధారిత తదితర పన్నులను జగన్ సర్కార్ పెంచుతోంది.
- By CS Rao Published Date - 11:56 AM, Sat - 26 March 22

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్నుల విధానం అక్కడ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బూచి చూపుతూ చెత్త, మరుగుదొడ్లు, ఆస్థి మూలాధారిత తదితర పన్నులను జగన్ సర్కార్ పెంచుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వింత పన్నులు వసూళ్ల పై అధికారులు సచివాలయం సిబ్బందిని వేధించడం దుర్మార్గపు చర్యగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. బ్రిటీష్ కాలంలో కూడా చెత్తపై, మరుగుదొడ్లు పై పన్నులు వేయలేదని, అలాంటి చెత్త పన్నులు వేసే క్రెడిట్ జగన్ ప్రభుత్వానికి చెందుతుందని టీడీపీ, జనసేన దుయ్యబడుతోంది.
విశాఖర మహా నగర పాలక సంస్థ కు బకాయిపడిన ఇంటి పన్ను , కొత్తగా విధించిన చెత్త పన్ను నిర్దేశిత లక్ష్యాల మేరకు వసూలు చేయలేదంటూ సంబంధిత ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు.
ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని, నిబంధనలకు విరుద్ధమని విపక్షాల అభిప్రాయం. కొన్నేళ్లుగా పేరుకుపోయిన పన్నులను బలవంతంగా వసూలు చేయడానికి కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. లక్ష్యాల మేరకువసూలు చేయాలని ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై కొరఢా జులిపించారు. కొత్తగా విధించిన చెత్త పన్ను పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార పార్టీ శాసనసభ్యులు, కార్పోరేటర్లు కొత్త పన్నుపై సమాధానం చెప్పుకోలేక తలపట్టుకుంటున్నారు.
చెత్త పన్ను వసూలుపై నగరపాలక సంస్థ వడ్డీ వ్యాపారి తరహాలో వేధిస్తుందని స్థానిక ప్రజల ఫీలింగ్. నాలుగు నెలల మొత్తాన్ని ఒకే సారి వసూలు చేయడాన్ని భారంగా మారింది. వసూలు చేయలేని జోన్ 6 లో 44 మంది సచివాలయం శానటరీ కార్యదర్శులకు మెమోలిచ్చారు. జోన్ 5 లో జీతం లో కోత విధిస్తామంటూ నోట్ జారీ చేయడం విడ్డూరం.
పన్నులు వసూలు కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేస్తామని, నీటి కొళాయి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇదంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దౌర్జన్య వైఖరిని పోలి ఉంది.
ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నా 15 శాతానికి మించి చెత్త పన్ను వసూలు కాలేదంటే ప్రజల్లో దీని పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతోంది .
ఇప్పటికే ఇంటి పన్ను విపరీతంగా పెంచి, విద్యుత్ చార్జీలను పెంచి నగర పేదలపై ప్రభుత్వం మోయ లేని భారాలను మోపింది. ఉద్యోగులకు పూర్తి జీతాలు అందించి ఇప్పటివరకు జారీ చేసిన మెమోలను నిలిపివే యాల్సిందిగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. పన్ను వసూలు చేయని సచివాలయాలలో ఉద్యోగులుగా చేరిన పట్టభద్రులు ఇప్పటికే రైస్ కార్డు తో పాటు పలు సంక్షేమ పథకాలను కోల్పోయారు.