Happy Drinking: ఫుల్లుగా తాగండి… ఖజానా నింపండి
నచ్చిన బ్రాండ్ ఎంచుకోండి.. ఫుల్లుగా తాగండి.. అలవాటు లేదా..! చేసుకుని మరీ తాగండి.. అంటోంది జపాన్ ప్రభుత్వం. యువత తాగుబోతులు కావాలని ప్రోత్సహిస్తోంది. పోటీలు పెడుతోంది.
- By Naresh Kumar Published Date - 02:15 PM, Sun - 21 August 22

నచ్చిన బ్రాండ్ ఎంచుకోండి.. ఫుల్లుగా తాగండి.. అలవాటు లేదా..! చేసుకుని మరీ తాగండి.. అంటోంది జపాన్ ప్రభుత్వం. యువత తాగుబోతులు కావాలని ప్రోత్సహిస్తోంది. పోటీలు పెడుతోంది.
జపాన్‌లో లిక్కర్ ఆదాయం ఏటేటా భారీగా పడిపోతుంది. 1995లో సగటున ఒక్కో జపనీయుడు ఏటా 100 లీటర్ల మందు తాగితే.. 2020 కల్లా అది ఏకంగా 75 లీటర్లకు పడిపోయిందట. 1980లో జపాన్ పన్ను ఆదాయంలో మద్యం వాటా 5శాతం ఉండగా.. 2011లో అది 3 శాతానికి తగ్గింది. 2020 వచ్చే సరికి అదికాస్తా 1.7 శాతానికి పడింది. గత 31 ఏళ్లలో ఇదే అతిపెద్ద తగ్గుదల. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్.. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బందులు పడుతోంది. మద్యం ఆదాయం రికార్డుస్థాయిలో పడిపోవడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయ్యింది.
దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా లిక్కర్ అమ్మకాలు పెంచాలని కంకణం కట్టుకుంది. సమస్య మూలం ఎక్కడ అని ఆరా తీస్తే… పెద్దలు పర్లేదు గానీ.. జపాన్ యువత అసలు మందు జోలికే పోవడం లేదని తేలిందట. లైఫ్ స్టైల్‌లో మార్పులు, కొవిడ్ సంక్షోభంతో ఆరోగ్యం విలువ తెలియడంతో.. మద్యం ముట్టడం మానేశారట. విషయం అర్థంకావడంతో… యువతను తాగుబోతులు చేయడంపై ఫోకస్ పెట్టింది జపాన్ సర్కార్. మందు తాగండి.. తాగి తూలండి అంటూ.. భారీ ప్రచారానికి తెర తీసింది. సేక్ వివా పేరుతో దేశవ్యాప్త పోటీ నిర్వహిస్తోంది. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏంచేయాలో సలహాలు సూచనలివ్వాలంటూ కాంపిటీషన్ పెట్టింది. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు. వినూత్నం, ఆకర్షణీయమై సేల్స్ టెక్నిక్స్ పద్ధతులను రూపొందించవచ్చు. నవంబర్ 10న టోక్యోలో విజేతలను ప్రకటిస్తుంది నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ. చెప్పుకోడానికి సరదాగానే ఉన్నా.. జపాన్ ప్రభుత్వ తీరుపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.