DDOS Attack : ట్రంప్‌ను మస్క్ ఇంటర్వ్యూ చేస్తుండగా ‘డీడీఓఎస్ ఎటాక్’.. ఏమిటిది ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
- By Pasha Published Date - 10:28 AM, Tue - 13 August 24

DDOS Attack : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ తరుణంలో ట్రంప్‌ను తాజాగా ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ సంచలన ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లైవ్‌లో జరుగుతుండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. చాలామంది వినియోగదారులకు ఈ వీడియో కనిపించలేదు. దీంతో ఈ ఇంటర్వ్యూపై డీడీఓఎస్(DDOS Attack) దాడి జరిగిందని తన సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. డీడీఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్. డీడీఓఎస్ సమస్యను పరిష్కరించే పనిలోనే ఉన్నామని ఆయన తెలిపారు. డీడీఓఎస్ సమస్య కారణంగా ఇంటర్వ్యూ వీడియోను తర్వాత ఎక్స్‌లో పోస్ట్ చేస్తానని, ప్రస్తుతానికి ఆడియోను అందుబాటులో ఉంచుతానని మస్క్ వెల్లడించారు. చెప్పిన విధంగానే ఆ తర్వాత ట్రంప్ ఇంటర్వ్యూ పూర్తి వీడియోను ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల మందికిపైగా ఈ ఇంటర్వ్యూను వీక్షించడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి డీడీఓఎస్ సంబంధిత సాంకేతిక సమస్యల వల్లే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. గత రాత్రి 8 గంటలకు ఈ ఇంటర్వ్యూ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ సమయానికి సరిగ్గా 18 నిమిషాల ముందు ఎక్స్‌లో డీడీఓఎస్ సమస్య తలెత్తింది. దీని గురించి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో ఎలాన్ మస్క్ వివరించారు. ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని పనిచేయనివ్వకుండా చేసేందుకు డేటాతో దానిని ఫ్లడ్ చేయడమే డీడీఓఎస్ అని ఆయన చెప్పారు.
ట్రంప్‌తో లైవ్‌లో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఎక్స్(ట్విట్టర్) కంపెనీకి చెందిన సర్వర్లపై భారీ స్థాయిలో డీడీఓఎస్ ఎటాక్ జరిగింది. ఈ సైబర్ దాడి జరగగానే సదరు సర్వర్లతో ముడిపడిన ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. తద్వారా దానికి సంబంధించిన టెక్ యాక్టివిటీ స్తంభిస్తుంది. డీడీఓఎస్ ఎటాక్ చేయడం అనేది ఒక సైబర్ క్రైమ్. సాధారణంగానైతే నిర్ధిష్ట వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వెబ్ సైట్లపై, డిజిటల్ అకౌంట్లపై డీడీఓఎస్ ఎటాక్స్ చేస్తుంటారు. తద్వారా సదరు వ్యక్తి లేదా సంస్థ ఆన్‌లైన్ సేవలు, సైట్‌లను యాక్సెస్ చేయకుండా అడ్డుకుంటారు. ఇంటర్నెట్ ట్రాఫిక్‌తో ఆ సర్వర్‌ను ముంచెత్తుతారు. ట్రంప్- మస్క్ ఇంటర్వ్యూ టైంలో ఎక్స్ సర్వర్లపైనా ఇదే విధంగా సైబర్ ఎటాక్ జరిగింది.