VPN : ‘వీపీఎన్’ వినియోగం ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకం.. పాక్‌లో ఫత్వా
వీపీఎన్‌ల(VPN) ద్వారా నిషేధిత కంటెంట్‌ను చూడటం అనేది ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిషిద్ధమని ఆయా మత సంస్థలు ప్రకటించాయి.
- By Pasha Published Date - 05:15 PM, Sun - 17 November 24

VPN : ‘వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్స్’.. దీన్నే మనం షార్ట్ కట్‌లో ‘వీపీఎన్’ అని పిలుస్తుంటాం. మనలో చాలామంది దీన్ని వాడుతుంటారు. మనం ఎవరమో తెలియకుండా, లొకేషన్‌ను బయటపెట్టకుండా ఏదైనా వెబ్‌సైట్‌ను, పోర్టల్‌ను చూసేందుకు వీలు కల్పించడమే వీపీఎన్ ప్రత్యేకత. ఇతరుల డిజిటల్ నిఘా నుంచి తప్పించుకోవడానికి వీపీఎన్ కీలకమైన మాధ్యమం. అయితే దీని వినియోగం విషయంలో పాకిస్తాన్‌లో కొత్త దుమారం మొదలైంది. వీపీఎన్‌ల వినియోగంపై అక్కడి ప్రముఖ ఇస్లామిక్ మత సంస్థలు జోక్యం చేసుకున్నాయి. వీపీఎన్‌ల(VPN) ద్వారా నిషేధిత కంటెంట్‌ను చూడటం అనేది ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిషిద్ధమని ఆయా మత సంస్థలు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా డిజిటల్ ఫైర్ వాల్
పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ ఫైర్ వాల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ తరుణంలో ముస్లిం మత సంస్థల ద్వారా వీపీఎన్ వినియోగం నిషిద్ధం అనే ప్రకటన చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలో ఫైర్ వాల్ వ్యవస్థను అమల్లోకి తేనుంది. ఇది అందుబాటులోకి రాగానే ఎవరూ వీపీఎన్‌లను వాడలేరు. ఒకవేళ వాటిని వాడాలని భావిస్తే.. పాకిస్తాన్ టెలీ కమ్యూనికేషన్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి.
Also Read :The Sabarmati Report : ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీని మెచ్చుకుంటూ మోడీ ఏమన్నారంటే..
ఫైర్ వాల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. పాకిస్తాన్‌లో ప్రజల డిజిటల్ యాక్టివిటీపై నిఘా మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. దీనివల్ల ఈ-కామర్స్ వ్యాపారాలు కూడా ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. మత సంస్థలు మాత్రం.. వీపీఎన్ వినియోగం వల్ల పాకిస్తాన్ ప్రజలకు పెద్దగా లాభమేం లేదని వాదిస్తున్నాయి. వీపీఎన్‌లను వాడుకొని పోర్న్ సైట్లను చూడటం తప్ప ఇంకేం చేయడం లేదని అవి అంటున్నాయి. ప్రజలను పోర్న్ నుంచి దూరంగా ఉంచాలంటే.. వీపీఎన్ లాంటివి లేకుంటేనే బెటర్ అని పాక్ మత సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.