JD Vance Usha Chilukuri Divorce : ఉషా చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విడాకులు..? ఆ వెంటనే వివాహం?
- By Vamsi Chowdary Korata Published Date - 02:50 PM, Sat - 1 November 25
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తన భార్య ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఓ రచయిత్రి తెలిపారు. అంతేకాకుండా ఆ వెంటనే ఇటీవలే ఆగంతకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను పెళ్లి చేసుకోనున్నారని రచయిత్రి షానన్ వాట్స్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒకే సమాధానంతో అన్ని విమర్శలకు చెక్ పెట్టారు.
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యక్తిగత జీవితంపై ఓ ప్రముఖ రచయిత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆయన మిస్సిసిప్పి యూనివర్సిటీలో జరిగిన టీపీయూఎస్‌ఏ కార్యక్రమంలో పాల్గొని.. అక్కడే ఎరికా కిర్క్‌నను కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. రచయిత్రి వీరిద్దరి బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరికి త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆ వెంటనే ఎరికా కిర్క్ పెళ్లి చేసుకుంటారని జోస్యం చెప్పారు.
న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి షానన్ వాట్స్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జేడీ వాన్స్, ఎరికా కిర్క్ ఆలింగనం చేసుకున్న ఫోటోకు బదులిస్తూ.. ఎక్స్ వేదికగా వీరిద్దరూ వచ్చే ఏడాది చివరి నాటికి పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అంతకు ముందే జేడీ వాన్స్ తన భార్య ఉషాకు విడాకులు ఇస్తారని.. అదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటిస్తారని పేర్కొన్నారు. రచయిత్రి చేసిన ఈ సంచలన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఏకంగా ఈ పోస్టుకు 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.
జేడీ వాన్స్.. ఉషా చిలుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇంత మంచి జీవితాన్ని వదులుకుని ఆయన ఎరికాను పెళ్లి చేసుకుంటారంటే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. మరికొందరేమో జేడీ వాన్స్ విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు తమకు కూడా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
విడాకుల ఊహాగానాలు రాకముందే జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఆయన టీపీయూఎస్‌ఏ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తన భార్య ఉషా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారని తాను ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. భారతీయ సంతతికి చెందిన ఉషా హిందూ మతానికి చెందినవారు కావడం, వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో MAGA అభ్యర్థిగా నిలబడాలని ఆశిస్తున్న నేపథ్యంలో.. ఉషా హిందువుగా ఉండటం రాజకీయంగా అడ్డంకి కావచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Vance announces divorce, marries Charlie Kirk’s widow by the end of 2026. https://t.co/waBOG8EYXi
— Shannon Watts (@shannonrwatts) October 30, 2025
అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. తన భార్య ఉషాకు మతం మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉషాను ఆకాశానికి ఎత్తుతూ.. ఆమె తన జీవితంలో దొరికిన అద్భుతమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన ద్వారా ఆయన భార్యపై మతం మారమని ఒత్తిడి చేస్తున్నారని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు ఆయన తాత్కాలికంగా తెరదించారు.
వివాదాస్పద ప్రకటన చేసిన షానన్ వాట్స్.. ఐదుగురు పిల్లల తల్లి. అలాగే మాజీ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్. శాండీ హుక్ దుర్ఘటన తర్వాత ఆమె తుపాకీ హింస నివారణ కార్యకర్తగా మారారు. మామ్స్ డిమాండ్ యాక్షన్ అనే సంస్థను స్థాపించి.. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆ సంస్థకు శాఖలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆమె రాసిన Fired Up పుస్తకం NYT బెస్ట్ సెల్లర్ జాబితాలో నిలిచింది.