US Vs Iran : ట్రంప్‌కు ఏదైనా జరిగితే వదలం.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్
ఇలాంటి విషయాల్లో అలర్ట్‌గా ఉండాలని ఇరాన్‌లోని అమెరికా ఉన్నతస్థాయి అధికారులకు కూడా బైడెన్ సర్కారు(US Vs Iran) సూచనలు జారీ చేసిందని సమాచారం.
- By Pasha Published Date - 12:05 PM, Tue - 15 October 24

US Vs Iran : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటివరకు మూడుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఘటనలతో ప్రస్తుత అమెరికా ప్రభుత్వం సైతం ఆందోళనలో ఉంది. అసలు దేశంలో ఏం జరుగుతోందోో అర్థం చేసుకోలేకపోతోంది. బహుశా .. ట్రంప్‌పై హత్యాయత్నాల వెనుక ఇరాన్ ఉందేమో అనే అనుమానం ప్రస్తుత బైడెన్ ప్రభుత్వానికి వస్తోంది. అందుకే తాజాగా బైడెన్ సర్కారు ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలినా.. దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగానే పరిగణిస్తామని వెల్లడించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలను అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని తెలిపింది. ఇలాంటి విషయాల్లో అలర్ట్‌గా ఉండాలని ఇరాన్‌లోని అమెరికా ఉన్నతస్థాయి అధికారులకు కూడా బైడెన్ సర్కారు(US Vs Iran) సూచనలు జారీ చేసిందని సమాచారం.
Also Read :Indian Billionaire : అప్పుల ఊబిలో నిరుపేద మహిళ.. అపర కుబేరుడి ఆపన్నహస్తం
అమెరికా వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా వ్యవహారాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికానే తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఇరాన్ అంటోంది. 2020 సంవత్సరంలో జరిగిన ఖాసీం సులేమానీ హత్యలో అమెరికా పాత్ర ఉందని ఇరాన్ గుర్తు చేస్తోంది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఖాసిం సులేమానీ హత్యకు ఆదేశాలిచ్చారని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్ తరఫున యుద్ధ భూమిలోకి దూకాలనే ఆలోచనలో అమెరికా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ట్రంప్‌పై హత్యాయత్నాల వ్యవహారంలోనూ ఇరాన్ కోణాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఇజ్రాయెల్‌పై దాడులు చేసినందుకుగానూ ఇరాన్‌పై ఇటీవలే పలు ఆంక్షలను కూడా అమెరికా అనౌన్స్ చేసింది.