Indian Billionaire : అప్పుల ఊబిలో నిరుపేద మహిళ.. అపర కుబేరుడి ఆపన్నహస్తం
యూసుఫ్ అలీ(Indian Billionaire) దానగుణంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- By Pasha Published Date - 11:44 AM, Tue - 15 October 24

Indian Billionaire : అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంధ్య అనే మహిళను ప్రముఖ బిలియనీర్ లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ ఆదుకున్నారు. ఆమె అప్పులన్నీ కట్టేయడంతో పాటు మరో రూ.10 లక్షలు ఇచ్చి సాయం చేశారు. యూసుఫ్ అలీ(Indian Billionaire) దానగుణంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read :Assembly Polls 2024 : ఇవాళ మోగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా
సంధ్య ఎవరు ? ఆమెకు ఎదురైన ఆపద ఏమిటి ?
- సంధ్య కేరళలోని నార్ద్ పరవుర్ వాస్తవ్యురాలు.
- 2019లో సంధ్య, ఆమె భర్త కలిసి ఇల్లు కట్టుకునేందుకు ఒక ప్రైవేటు సంస్థలో రూ.4 లక్షల లోన్ తీసుకున్నారు.
- 2021 సంవత్సరంలో పిల్లల్ని భార్యను వదిలేసి సంధ్య భర్త వెళ్లిపోయాడు. దీంతో అప్పుల భారం సంధ్యపై పడింది. వడ్డీలు పెరిగి అప్పుల మొత్తం రూ.8 లక్షలకు చేరింది.
- రూ.8 లక్షలు తిరిగి చెల్లించాలంటూ సంధ్యకు రుణ సంస్థ వరుస వార్నింగ్‌లు ఇచ్చింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.
- ప్రస్తుతం సంధ్య ఒక బట్టల దుకాణంలో పనిచేస్తోంది.
- ఇటీవల సంధ్య ఇంటిని సదరు రుణ సంస్థ స్వాధీనం చేసుకుంది. కనీసం ఇంటి సామాన్లను తీసుకునేందుకు కూడా ఆ రుణ సంస్థ నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మీడియాలో దీనిపై కథనాలు రావడంతో చూసి యూసుఫ్ అలీ స్పందించారు. ఆయన తన సిబ్బందిని పంపి సంధ్య లోన్ కట్టేశారు. ఆమెకు రూ.10లక్షల సాయం కూడా చేశారు.లులు గ్రూప్ మీడియా ప్రతినిధి ఆమెకు ఇంటి తాళం చెవి అందజేశారు.
- యూసుఫ్ అలీ దానగుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయనను మనసున్న మారాజుగా నెటిజన్లు కీర్తిస్తున్నారు.
- తన కుటుంబాన్ని ఆదుకున్నందుకు యూసుఫ్ అలీకి సంధ్య కృతజ్ఞతలు తెలిపింది. బిలియనీర్‌గా ఎదిగినా సామాన్యుల బాధలను అర్థం చేసుకోవడం యూసుఫ్ అలీ గొప్పతనమని ఆమె చెప్పారు. సమాజానికి ఇలాంటి వారి అవసరం ఉందని సంధ్య తెలిపారు.