Anmol Bishnoi : లారెన్స్ సోదరుడు అన్మోల్‌ను ఇండియాకు తీసుకొచ్చే యత్నాలు స్పీడప్
లారెన్స్, అన్మోల్(Anmol Bishnoi) సోదరులు పంజాబ్‌లోని ఫాజిల్కా ప్రాంతానికి చెందినవారు.
- By Pasha Published Date - 09:52 AM, Sat - 2 November 24

Anmol Bishnoi : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్నా.. అతడి గ్యాంగ్ మాత్రం హల్‌చల్ చేస్తోంది. ఇటీవలే ముంబైలో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దిఖీ హత్య జరిగింది. దీని వెనుక లారెన్స్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు నిందితులు కూడా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల ఇంటరాగేషన్‌లో ఇదే విషయాన్ని చెప్పారు. కెనడాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు 25 ఏళ్ల అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాలతోనే ఈ మర్డర్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అన్మోల్ తరుచుగా కెనడా నుంచి అమెరికాకు వెళ్లి వస్తుంటాడు.
ఈనేపథ్యంలో తాజాగా అమెరికా నిఘా వర్గాల నుంచి ముంబై పోలీసులకు కీలక సమాచారం అందింది. అన్మోల్ తరుచుగా తమ దేశానికి వచ్చి వెళ్తున్నాడని తెలిపింది. దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు.. అన్మోల్ బిష్ణోయ్‌ను తమకు అప్పగించాలంటూ అక్టోబరు 16 నుంచే లీగల్ ప్రొసీడింగ్స్ మొదలుపెట్టారని సమాచారం. ఈమేరకు ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారట. సాధ్యమైనంత వేగంగా అమెరికా నుంచి ముంబైకి అన్మోల్‌ను రప్పించే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. మరోవైపు అన్మోల్ బిష్ణోయ్ ఆచూకీని చెప్పే వారికి రూ.10 లక్షల రివార్డును అందిస్తామని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది.
Also Read :Trivikram : 2029 ఎన్నికల ముందు భారీ పొలిటికల్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. హీరో ఎవరు..?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన జరిగినప్పటి నుంచే ఎన్ఐఏ రాడార్‌లో అన్మోల్ బిష్ణోయ్ ఉన్నాడు. భారతదేశ ఉగ్రవాద నిరోధక సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అతడి పేరు ఉంది. అన్మోల్ బిష్ణోయ్ మరో పేరు భాను. లారెన్స్, అన్మోల్(Anmol Bishnoi) సోదరులు పంజాబ్‌లోని ఫాజిల్కా ప్రాంతానికి చెందినవారు. చాలా చిన్న వయసులోనే వీరు నేరగాళ్లుగా మారడం గమనార్హం.