NSSO Survey : తెలంగాణలో అప్పుల ఊబిలో 42 శాతం మంది.. ఎన్ఎస్ఎస్‌ఓ సంచలన నివేదిక
తెలంగాణ ప్రజల్లో ఎక్కువమంది ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో.. అత్యవసరాలు వచ్చినప్పుడు అప్పులు(NSSO Survey) చేస్తున్నారు.
- By Pasha Published Date - 09:12 AM, Sat - 2 November 24

NSSO Survey : జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మనదేశంలోని 8,758 గ్రామాలు, 6,540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై విద్య, ఆరోగ్యం, అప్పులు, మొబైల్, ఇంటర్నెట్ తదితర అంశాలపై ఎన్‌ఎస్‌ఎస్‌వో సర్వే నిర్వహించింది. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను కూడా విశ్లేషించింది.వివరాలివీ..
Also Read :ABC Juice Benefits : మీరు ABC జ్యూస్ గురించి విన్నారా..? ఈ జ్యూస్ వల్ల లాభాలు, నష్టాలు తెలుసుకోండి..!
42.4 శాతం మందికి అప్పులు
రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 42.4 శాతం మందికి అప్పులు ఉన్నాయని వెల్లడైంది. మనదేశ జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
చేబదులు చెల్లించలేక..
తెలంగాణ ప్రజల్లో ఎక్కువమంది ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో.. అత్యవసరాలు వచ్చినప్పుడు అప్పులు(NSSO Survey) చేస్తున్నారు. ఇతరుల వద్ద డబ్బులను చేబదులు తీసుకుంటున్నారు. అయితే ఆ డబ్బును సకాలంలో తిరిగి ఇవ్వలేక సతమతం అవుతున్నారు. ఆదాయం తగిన విధంగా లేకపోవడం, అది క్రమంగా పెరగకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణ లోని 18 ఏళ్లకు పైబడిన ప్రతి లక్ష మందికిగానూ 42,407 మంది ఇలాంటి పరిస్థితుల్లోనే జీవితం గడుపుతున్నారు.
గ్రామీణ ప్రజలకే ఎక్కువ అప్పులు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకే ఎక్కువ అప్పులు ఉన్నాయి. తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి లక్ష మందిలో సగటున 50,289 మంది, పట్టణాల్లో ప్రతి లక్ష మందిలో 31,309 మంది అప్పుల్లో ఉన్నారు.
- రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 97.5 శాతం మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి.
- తెలంగాణలోని ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక సభ్యుడు ఏటా ఒకసారి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్నారు. గ్రామాల్లోని కుటుంబాలు ప్రతి సంవత్సరం వైద్య ఖర్చులకు రూ.5,088, పట్టణాల్లోని కుటుంబాలు ఏటా వైద్యానికి రూ.5,648 ఖర్చు చేస్తున్నాయి.
92.3 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు
తెలంగాణలో 15 ఏళ్లకు పైబడిన వారిలో 92.3 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీరిలో పురుషులు 96.4 శాతం, మహిళలు 88.2 శాతం ఉన్నారు. గ్రామాల్లో 90.7 శాతం మంది, పట్టణాల్లో 94.5 శాతం మంది ఫోన్లను వినియోగిస్తున్నారు.