Trump : ట్రంప్ మళ్లీ యాక్టివ్.. ప్రత్యేక విమానంలో మిల్వాకీకి
తనపై హత్యాయత్నం జరిగిన 24 గంటల్లోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన ఎన్నికల ప్రచార యాక్టివిటీని మొదలుపెట్టారు.
- By Pasha Published Date - 07:46 AM, Mon - 15 July 24

Trump : తనపై హత్యాయత్నం జరిగిన 24 గంటల్లోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన ఎన్నికల ప్రచార యాక్టివిటీని మొదలుపెట్టారు. ఇవాళ తెల్లవారుజామునే ఆయన ప్రత్యేక విమానంలో విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరానికి చేరుకున్నారు. ఇవాళ ఈ నగరంలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ పాల్గొననున్నారు. మిల్వాకీ నగరంలోని విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అవుతున్న ఒక వీడియోను ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. “ట్రంప్ ఫోర్స్ వన్” అని పిలిచే ప్రత్యేక విమానంలో తాము ప్రయాణించామని ఆయన వెల్లడించారు. ట్రంప్(Trump) ఎన్నికల ప్రచారం కోసం బోయింగ్ కంపెనీకి చెందిన ఈ విమానాన్ని వాడుతున్నట్లు తెలిపారు. మిల్వాకీ నగరంలోని ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా.. కాక్ పిట్‌లోని సిబ్బంది కౌంట్ డౌన్ చేస్తున్న సీన్‌ను ఎరిక్ ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో మనం చూడొచ్చు. విస్కాన్సిన్ నగరంలోని విమానాశ్రయంలో ప్రజలు విమానం నుంచి దిగడం కూడా ఇందులో కనిపించింది.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు తన సొంత సోషల్ మీడియా ‘‘ట్రూత్ సోషల్’’లో డొనాల్డ్ ట్రంప్ ఓ పోస్ట్ చేస్తూ.. ‘‘నా షెడ్యూల్‌లో మార్పులు చేయడానికి షూటర్‌ను కానీ.. ఇంకెవరిని కానీ అనుమతించను’’ అని తేల్చిచెప్పారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మిల్వాకీ నగరానికి చేరుకొని రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌లో(Republican Party Convention) పాల్గొంటానని స్పష్టం చేశారు. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయాలనే దానిపై తుది నిర్ణయాన్ని రిపబ్లికన్ పార్టీ ప్రకటించే కీలక సమావేశం ఇవాళ మిల్వాకీ నగరంలో జరగనుంది. అందుకే ఈ మీటింగ్‌కు అంతటి ప్రాధాన్యం ఉంది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు అనే దానిపైనా సోమవారంకల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హత్యాయత్నం తర్వాత కూడా సాహసోపేతంగా ట్రంప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలు ఆయనకు జనంలో మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయి. తాజా పరిణామాలతో ఇప్పుడు ట్రంప్ గ్రాఫ్ భారీగా పెరిగిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.