Suicide Attack : స్కూలు బస్సుపై సూసైడ్ ఎటాక్.. నలుగురు పిల్లల మృతి, 38 మందికి గాయాలు
ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో పాకిస్తాన్ సైనికుల పిల్లలు(Suicide Attack) చదువుతుంటారు.
- Author : Pasha
Date : 21-05-2025 - 1:41 IST
Published By : Hashtagu Telugu Desk
Suicide Attack : పాకిస్తాన్‌లో ఘోరం జరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూలు పిల్లలతో వెళ్తున్న బస్సుపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు పిల్లలు చనిపోయారు. మిగతా 38 మంది పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుదూజార్ నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సూసైడ్ ఎటాక్ కోసం ఉగ్రవాదులు ఒక కారును వాడినట్లు గుర్తించారు.
Also Read :Rohit Sharma: ధోనీలా టెస్టులకు వీడ్కోలు చెబుదామనుకున్న రోహిత్.. బీసీసీఐ తిరస్కారం
పాకిస్తాన్ సైనికుల పిల్లలు లక్ష్యంగా..
ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో పాకిస్తాన్ సైనికుల పిల్లలు(Suicide Attack) చదువుతుంటారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బీఎల్ఏ వేర్పాటువాదులు పాకిస్తాన్ ఆర్మీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ సైతం ఇక్కడి వేర్పాటువాదులను దారుణంగా అణచివేస్తోంది. ఇందువల్లే నిత్యం ఉగ్రదాడులతో బెలూచిస్తాన్ ప్రాంతం రక్తసిక్తం అవుతోంది. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ కోరుతోంది. ఈ దాడిని పాకిస్తాన్ హోంశాఖ మంత్రి మొహసీన్ నఖ్వీ ఖండించారు. పిల్లలపై దాడి చేసినవారు రాక్షసులని ఆయన మండిపడ్డారు. ‘‘శత్రువు అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకొని పూర్తి అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తులు మానవ మృగాలు’’ అని నఖ్వీ ధ్వజమెత్తారు.
Also Read :Mohanlal Biography: బర్త్‌డే వేళ మోహన్‌లాల్ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం
భారత్‌పై విషం కక్కిన పాక్ ఆర్మీ
దీనిపై పాకిస్తాన్ ఆర్మీ స్పందిస్తూ.. ‘‘ఈ బాంబు దాడి పిరికిచర్య. ఇది భయంకరమైన దాడి. మా పొరుగుదేశమే బెలూచిస్తాన్‌లో ఇలాంటి దాడులు చేయిస్తోంది’’ అని ఆరోపించింది. మరోసారి భారత్‌పై ఈవిధంగా పాక్ ఆర్మీ విషం కక్కింది. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద గ్రూపు కూడా ఈ సూసైడ్ ఎటాక్‌కు బాధ్యత వహించలేదు. బీఎల్ఏ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే బెలూచిస్తాన్‌లోని ఖిల్లా అబ్ధుల్లా ప్రాంతంలో కారుబాంబు పేలడంతో నలుగురు చనిపోయారు. ఈ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది.