Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చే మిషన్.. మరో కీలక ముందడుగు
ఈనేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఐఎస్ఎస్‌లో ఉండిపోయిన సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు గత శనివారం రోజే స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షానికి(Sunita Williams) పంపారు.
- Author : Pasha
Date : 30-09-2024 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ కంపెనీకి చెందిన ‘స్టార్ లైనర్’ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లారు. అయితే స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అందులో వారు భూమికి తిరిగి రాలేకపోయారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ను వ్యోమగాములు లేకుండానే ఆటో పైలట్ విధానంలో భూమికి రప్పించారు. ఈనేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఐఎస్ఎస్‌లో ఉండిపోయిన సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు గత శనివారం రోజే స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షానికి(Sunita Williams) పంపారు. అది ఎట్టకేలకు ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది.
Also Read :TG DSC Result 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరికాసేపట్లో రిజల్ట్స్..!
ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో వెళ్లిన అమెరికా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు కూడా ఐఎస్ఎస్‌లోకి అడుగుపెట్టారు. వారికి సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్, మరో ఏడుగురు ఐఎస్ఎస్ ప్రత్యేక వ్యోమగాములు స్వాగతం పలికారు. ఈసందర్భంగా వ్యోమగాములు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ప్రత్యేక న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించారు. సునితా విలియమ్స్ కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఐఎస్ఎస్‌లో తమ అనుభవాలను అక్కడున్న వ్యోమగాములు వివరించారు. ఈ కార్యక్రమాన్ని నాసా లైవ్‌లో ప్రసారం చేసింది.
Also Read :Psychological First Aid : సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి, అది మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించగలదు..?
తాజాగా ఇప్పుడు ఐఎస్ఎస్‌కు చేరుకున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి రానుంది. అందులోనే సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు మళ్లీ భూమికి చేరుకుంటారు. దీంతో వారిద్దరు దాదాపు 8 నెలల పాటు ఐఎస్ఎస్‌లో గడిపినట్లయింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వారిని 8 నెలల పాటు అంతరిక్షానికి పరిమితం చేసింది. ఇటీవలే సునితా విలియమ్స్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యామిలీని మిస్సవుతున్నానని చెప్పారు. ఇంతకాలం స్పేస్‌లో ఉండాల్సి వస్తున్నందుకు తాను బాధపడటం లేదని.. సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.