Scarcity of Food: తినడానికి తిండికోసం కటకట.. పాక్‌లో దుర్భర స్థితి
పొరుగుదేశం పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు దొరకడం లేదు.
- Author : Anshu
Date : 15-01-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Scarcity of Food: పొరుగుదేశం పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు దొరకడం లేదు. తిండి తినాలంటే విపరీతంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. గోధుమపిండి, ఉల్లిపాయలు, చికెన్ లాంటి సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. వాటికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. ధరల్లో దాదాపు 500 నుండి వెయ్యి శాతం పెరుగుదల కనిపిస్తోంది.
పాకిస్థాన్ లో గతకొద్ది సంవత్సరాలుగా స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు సరైన పాలన అందించకపోవడం లాంటివి ప్రస్తుత దుర్భర స్థితికి కారణం. పాకిస్థాన్ లో పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది. దేశంలో
విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం, వరదలు వంటి వాటి ప్రభావం పాకిస్థాన్‌లో విపరీతంగా కనిపిస్తోంది.
తాజాగా గోధుమపిండి కోసం జనాలు పరుగులు తీస్తుండటం, గోధుమపిండి లారీని బైకులతో జనాలు ఫాలో చేయడం కనిపించింది. అక్కడ ఎక్కువగా వాడే గోధుమపిండి కోసం జనాలు ఇలా రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రొఫెసర్ సజ్జాద్ రజా తాజాగా గోధుమ పిండి కోసం జనాలు ఎంతలా తాపత్రయ పడుతున్నారో తెలియజేసేలా వీడియో పెట్టగా.. అది పాక్ లోని దుర్భర స్థితిని తెలియజేస్తోంది.
ప్రొఫెసర్ సజ్జాద్ రజా సదరు వీడియోను పోస్ట్ చేస్తూ ఇలా రాశారు..‘ఇది మోటార్‌సైకిల్ ర్యాలీ కాదు. ఒక ప్యాకెట్ గోధుమ పిండిని కొనుక్కోగలమనే ఆశతో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న లారీని ప్రజలు వెంబడిస్తున్నారు. పాకిస్థాన్‌లో మనకు భవిష్యత్తు ఏమైనా ఉందా? పాకిస్థాన్‌లో జరుగుతున్నదానికి ఓ చిన్న మచ్చు తునక మాత్రమే ఈ వీడియో’ అని పేర్కొన్నాడు.