Nuclear Doctrine : ఖబడ్దార్.. అణ్వస్త్ర సిద్ధాంతాన్ని మార్చేస్తాం.. రష్యా సంచలన ప్రకటన
శత్రువులు రష్యాపై అణ్వస్త్ర దాడి చేసినప్పుడు లేదా రష్యా ఉనికికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు అనేది ప్రస్తుత రష్యా అణ్వస్త్ర సిద్ధాంతం.
- By Pasha Published Date - 10:28 AM, Mon - 2 September 24

Nuclear Doctrine : సంచలన నిర్ణయం తీసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. త్వరలోనే తమ అణ్వస్త్ర సిద్ధాంతాన్ని మార్చేస్తామని రష్యా ప్రభుత్వం అంటోంది. నాటో దేశాలు ఆయుధాలిచ్చి మరీ తమపైకి ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వస్త్ర సిద్ధాంతంలో మార్పులు చేయక తప్పదని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యబ్‌కోవ్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఎలాంటి మార్పులు చేస్తారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. శత్రువులు రష్యాపై అణ్వస్త్ర దాడి చేసినప్పుడు లేదా రష్యా ఉనికికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు అనేది ప్రస్తుత రష్యా అణ్వస్త్ర సిద్ధాంతం. ఇప్పుడు ఉక్రెయిన్, నాటో దేశాల నుంచి రష్యాకు ముప్పు పొంచి ఉన్నందున.. ఆ సిద్ధాంతంలో మార్పు చేయబోతున్నారు. ఇరుగుపొరుగు దేశాల్లో జరిగే రష్యా వ్యతిరేక సైనిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా, వాటికి న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చేలా కొత్త అణ్వస్త్ర సిద్దాంతం ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త అణ్వస్త్ర సిద్ధాంతంపై రష్యా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు సోమవారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పైకి రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపైకి డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది.ఈ దాడులను ఉక్రెయిన్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది. ఈ దాడుల వల్ల కీవ్‌లోని హోలోసివ్స్కీ, సోలోమియాన్స్కీ జిల్లాల్లో బాగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించారు. షెవ్చెంకివ్స్కీ జిల్లాలో ఒకరు చనిపోయారు. ఈనేపథ్యంలో తమకు అందించిన యుద్ధ విమానాలతో రష్యాలోకి వెళ్లి దాడులు చేసేందుకు అనుమతులివ్వాలని అమెరికా, నాటో దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుతున్నారు. ధీటైన జవాబుతోనే రష్యాను కట్టడి చేయొచ్చని ఆయన వాదిస్తున్నారు. అయితే ఈ వాదనతో చాలా నాటోదేశాలు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. తాము అందించిన ఆయుధాలను ఉక్రెయిన్ భూభాగం లోపల మాత్రమే చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం.