Helicopter Crash : ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్.. కారణం అదే
హెలికాప్టర్‌లోని ముఖ్యమైన భాగాలు, వివిధ సాంకేతిక వ్యవస్థల పరికరాలను సేకరించి స్టడీ చేయగా కుట్రపూరిత దాడికి సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు.
- By Pasha Published Date - 09:19 AM, Mon - 2 September 24

Helicopter Crash : అజర్ బైజాన్ – ఇరాన్ బార్డర్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ చనిపోయారు. దీనిపై ముమ్మర దర్యాప్తు చేయాలని సైనిక బలగాల సుప్రీంబోర్డును ఇరాన్ ప్రభుత్వం(Helicopter Crash) ఆదేశించింది. దీంతో సైనిక బలగాల సుప్రీంబోర్డు జరిపిన దర్యాప్తులో కీలక వివరాలను గుర్తించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దట్టమైన పొగమంచు వల్లే పర్వతాన్ని హెలికాప్టర్ ఢీకొని కూలిపోయిందని విచారణలో తేల్చారు. హెలికాప్టర్‌లోని ముఖ్యమైన భాగాలు, వివిధ సాంకేతిక వ్యవస్థల పరికరాలను సేకరించి స్టడీ చేయగా కుట్రపూరిత దాడికి సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు. దీంతో కుట్రకోణం ఉందంటూ జరిగిన ప్రచారంలో వాస్తవికత లేదని వెల్లడైంది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో నాటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీతో పాటు మరో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ‘హార్డ్ ల్యాండింగ్’ అయింది. విమానాలు క్రాష్ అయినప్పుడు జరిగే ప్రమాదాలను చెప్పడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. అప్పట్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడులు జరిగిన కొన్ని వారాల తర్వాతే ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్, ఇరాన్‌లోని ఇబ్రహీం రయీసీ వ్యతిరేకులతో చేతులు కలిపి ఈ హెలికాప్టర్ క్రాష్‌కు కుట్ర చేసి ఉంటారనే ప్రచారం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ కుమారుడు ముజ్తబా తన ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇబ్రహీం రయీసీ నాయకత్వ పటిమ వల్ల ఆయనకే భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ పదవి దక్కుతుందనే టాక్ నడిచేది. అయితే ఈవిషయం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ కుమారుడు ముజ్తబాకు నచ్చేది కాదని పేర్కొంటూ విదేశీ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఇబ్రహీం రయీసీ మరణం వెనుక కుట్రకోణం లేదని నివేదిక వెలువడటం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు కూడా తగ్గింది.