Russia Vs Canada : కెనడా తప్పు చేస్తోందంటూ రష్యా ఆగ్రహం.. నాజీ సైనికుడికి సన్మానంపై దుమారం
Russia Vs Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కెనడాపై రష్యా కూడా విరుచుకుపడింది.
- By Pasha Published Date - 09:54 AM, Tue - 26 September 23

Russia Vs Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కెనడాపై రష్యా కూడా విరుచుకుపడింది. ఓ వైపు ఖలిస్థానీ ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్న కెనడా సర్కారు.. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌తో కలిసి పోరాడిన 98 ఏళ్ల యారోస్లోవ్ హుంకా అనే నాజీ సైనికుడిని ఇటీవల ఏకంగా దేశ పార్లమెంటులో సత్కరించింది. మానవాళికి ఆనాడు ముప్పుగా మారిన నాజీ సైనికుడిని కెనడా పార్లమెంటులో సత్కరించడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా చర్య అత్యంత దారుణమని వ్యాఖ్యానించింది. చారిత్రక సత్యాన్ని కెనడా పట్టించుకోవడం లేదనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొంది. నాజీల రాక్షస తత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, అటువంటి పీడకలను ప్రోత్సహించడం మానుకోవాలని కెనడాకు రష్యా హితవు పలికింది.
Also read : Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?
అసలేం జరిగింది ?
నాజీ సైనికుడు యారోస్లోవ్ హుంకాను కెనడా పార్లమెంటులో ఇటీవల సత్కరిస్తూ.. ‘‘రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడు యారోస్లోవ్ హుంకా’’ అని స్పీకర్ కీర్తించారు. అక్కడే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి హంకాను అభినందించారు. దీనిపైనే ఇప్పుడు రష్యా ఘాటుగా స్పందించింది. నాజీ సైనికుడ్ని సత్కరించడంపై దుమారం రేగడంతో స్పందించిన కెనడా స్పీకర్ ‘పొరపాటు జరిగింది’ అంటూ క్షమాపణలు చెప్పారు. నాజీలతో హుంకాకు సంబంధాలున్నట్టు తమకు తెలియదని స్పష్టం చేశారు. దీనిపై తాను రాజీనామాకు కూడా సిద్దమేనని స్పీకర్ ప్రకటించారు. ఇలా జరిగినందుకు కలత చెందానని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు. ఇది కెనడా పార్లమెంటుకు, కెనడియన్లందరికీ ఇబ్బందికరమైన విషయమని (Russia Vs Canada) చెప్పారు.