Dirty Bomb Claim: రష్యా-ఉక్రెయిన్.. డర్టీ బాంబ్ టెన్షన్..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అణుయుద్ధంగా మారబోతోందా..?
- By Gopichand Published Date - 10:41 PM, Thu - 27 October 22
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అణుయుద్ధంగా మారబోతోందా..? అణ్వాస్త్రాలకు బూజు దులిపి డ్రిల్స్ నిర్వహించడం వెనుక పుతిన్ వ్యూహమేంటి..? మరోవైపు.. ఈ వార్‌లో ఇప్పుడు వినిపిస్తున్న పదం డర్టీ బాంబ్. నిన్న మొన్నటి వరకూ యుద్ధ ట్యాంకులు, మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరు దేశాలు ఇప్పుడు మరో కొత్త అస్త్రంతో యుద్ధానికి సై అంటే సై అంటున్నాయి. డర్టీ బాంబ్‌పై ఇరుదేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో యుద్ధం క్రమంగా అణు అంచులకు చేరుతోందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
డర్టీ బాంబ్‌ను ఓ చిన్న సైజు న్యూక్లియర్ బాంబ్‌గా చెప్పొచ్చు. ఇదేమీ పూర్తి స్థాయి అణుబాంబు కాదు. వాతావరణంలోకి కొంత రేడియేషన్ విడుదల చేసి భయాందోళలను కల్గిస్తుంది. అణ్వస్త్రాల కంటే కూడా చాలా సులభంగా, తక్కువ ధరలో వీటిని తయారు చేయొచ్చు. అణుధార్మిక పదార్థాలు, డైనమైట్లాంటి పేలుడు పదార్థాల మిశ్రమంతో వీటి తయారు చేస్తారు. పేలుడు తీవ్రతను బట్టి అణుధార్మిక పదార్థం వాతావరణంలో విస్తరిస్తుంది. రేడియేషన్‌కు గురైన ఇళ్లు, కార్యాలయాలు.. తదితర ప్రాంతాలను శుభ్రం చేయటం అత్యంత ఖరీదుతో కూడుకున్న వ్యవహారం.
అయితే.. ఈ డర్టీ బాంబ్ ప్రమాదకరమేకానీ ప్రాణాంతకం కాదంటున్నారు విశ్లేషకులు.చరిత్రలో డర్టీ బాంబును ప్రయోగించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. 20 ఏళ్ల కిందట రష్యా దక్షిణ ప్రాంతమైన చెచెన్యాలో రెండుసార్లు వీటిని పేల్చటానికి విఫలయత్నం జరిగినట్లు చెబుతారు. ఇజ్రాయెల్ కూడా 2015లో ప్రయోగాత్మకంగా డిమోనా అణురియాక్టర్ వద్ద దీన్ని ప్రయోగించినట్లు కథనాలు వచ్చాయి. గతంలో అల్‌ఖైదా ఉగ్రవాదుల వద్ద ఈ డర్టీ బాంబు తయారీకి సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి అమెరికా, బ్రిటన్ సైన్యాలు. మరోవైపు.. ఉక్రెయిన్‌తో యుద్ధం తీవ్రస్థాయికి చేరిన వేళ.. రష్యా అణు విన్యాసాలు చేపట్టింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వీటిని పర్యవేక్షించారు. అణు విన్యాసాల్లో భాగంగా బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌ను రష్యా పరీక్షించింది. నాటో అణువిన్యాసాలను చేపడుతున్న సమయంలోనే రష్యా ఈ డ్రిల్స్ చేపట్టడం చర్చనీయాంశమైంది. అటు.. రష్యా అణు విన్యాసాలను అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది.
Related News
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.