లోదుస్తుల యాడ్‌తో కొత్త చిక్కులు..హాలీవుడ్ సైన్ బోర్డుపై నటి సిడ్నీ స్వీనీ !
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2026 - 1:59 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఓ స్టంట్ వివాదాస్పదంగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కి లోదుస్తులను ప్రదర్శించడంపై ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు స్పందిస్తూ ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.
- ప్రఖ్యాత హాలీవుడ్ అక్షరాలపై బ్రాలను వేలాడదీసి వీడియో చిత్రీకరణ
- లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్ కోసం హాలీవుడ్ సైన్ బోర్డు ఎక్కిన నటి సిడ్నీ స్వీనీ
- గతంలోనూ ఓ జీన్స్ యాడ్‌తో వివాదంలో చిక్కుకున్న సిడ్నీ
- నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేసు నమోదు కావచ్చని కథనాలు
- అయితే ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదన్న పోలీసులు
ఇటీవల అర్ధరాత్రి సమయంలో, సిడ్నీ స్వీనీ నల్లటి దుస్తులు ధరించి కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కారు. అక్కడున్న అక్షరాలకు ఓ తాడు కట్టి, దానికి బ్రాలను వేలాడదీశారు. ఈ మొత్తం స్టంట్‌ను వీడియో తీయగా, దానిని ప్రముఖ మీడియా సంస్థ టీఎమ్‌జెడ్ (TMZ) షేర్ చేసింది. ఈ వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది.
Sydney Sweeney could face vandalism charges after climbing the Hollywood sign and hanging bras on it to promote her new lingerie brand.
(via TMZ)
pic.twitter.com/906WzHsuJj— FearBuck (@FearedBuck) January 26, 2026
టీఎమ్‌జెడ్ కథనం ప్రకారం ఈ షూటింగ్ కోసం సిడ్నీ బృందం ఫిల్మ్ఎల్ఏ నుంచి అనుమతి పొందింది. అయితే, ఆ అనుమతి కేవలం సైన్ సమీపంలో షూటింగ్ చేసుకోవడానికే కానీ, దానిని తాకడానికి లేదా ఎక్కడానికి వీల్లేదు. ఇది నిబంధనల ఉల్లంఘన కావడంతో ఆమెపై కేసు నమోదు కావచ్చని కథనాలు వెలువడ్డాయి.
అయితే, ఈ విషయంపై లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ (LAPD) ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. “ఎలాంటి నేరం జరగలేదు. ప్రస్తుతం ఎటువంటి విచారణ జరగడం లేదు” అని స్పష్టం చేసింది. దీంతో ఆమెపై తక్షణ చట్టపరమైన చర్యలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాగా, సిడ్నీ స్వీనీ గత ఏడాది కాలంగా ఈ లోదుస్తుల బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్లకు సంబంధించిన ఇన్వెస్టర్లు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. కాగా, సిడ్నీ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆమె నటించిన ఓ జీన్స్ యాడ్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.