నెతన్యాహు హంగేరీ వస్తే అరెస్ట్ ఖాయం: కొత్త ప్రధాని
నిజానికి 1956 నాటి హంగేరీ ఉద్యమ 70వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని పీటర్ మాగ్యార్ గతంలోనే నెతన్యాహుకు ఆహ్వానం పంపారు. అయితే ఇప్పుడు నెతన్యాహుపై ICC నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
- Author : Gopi
Date : 21-04-2026 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
Benjamin Netanyahu: ఇరాన్- లెబనాన్లతో కొనసాగుతున్న యుద్ధం ఇజ్రాయెల్‌కు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ఒకవైపు అమెరికా మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తుండగా మరోవైపు హంగేరీ కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుపై కఠిన వైఖరిని ప్రకటించింది. హంగేరీ కొత్త ప్రధానమంత్రి పీటర్ మాగ్యార్ మాట్లాడుతూ.. నెతన్యాహు గనుక తమ దేశంలో అడుగుపెడితే వెంటనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
చారిత్రాత్మక విజయం తర్వాత నిర్ణయం
ఏప్రిల్ 12, 2026న జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో పీటర్ మాగ్యార్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. గత 16 ఏళ్లుగా అధికారంలో ఉన్న విక్టర్ ఓర్బన్‌ను ఆయన ఓడించారు. తన పార్టీ ‘టిస్జా’ ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించిన పీటర్.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే ఇజ్రాయెల్ విషయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవేదన
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిబంధనలే కీలకం
స్కై న్యూస్ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఉన్న ఎవరైనా హంగేరీ సరిహద్దుల్లోకి వస్తే వారిని అదుపులోకి తీసుకుంటామని పీటర్ తెలిపారు. గత ప్రభుత్వం ICC నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన రద్దు చేస్తూ హంగేరీ నిరంతరం ICCలో సభ్యదేశంగా కొనసాగుతుందని ప్రకటించారు.
వివాదానికి కారణం ఏంటి?
నిజానికి 1956 నాటి హంగేరీ ఉద్యమ 70వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని పీటర్ మాగ్యార్ గతంలోనే నెతన్యాహుకు ఆహ్వానం పంపారు. అయితే ఇప్పుడు నెతన్యాహుపై ICC నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. హంగేరీ చట్టబద్ధంగా ICC నిబంధనలను పాటిస్తుంది. ఇందులో వెనక్కి తగ్గేది లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. 2024లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నెతన్యాహుపై ICC అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల నెతన్యాహు హంగేరీ పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది.