JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!
- By Vamsi Chowdary Korata Published Date - 11:51 AM, Thu - 27 November 25
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ వివాహ బంధంపై నెలకొన్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. గతంలో ఓ కార్యక్రమంలో ఆమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడంతో.. జేడీ వాన్స్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే బుధవారం కెంటుకీలోని సైనికులకు థాంక్స్ గివింగ్ విందు వడ్డించే కార్యక్రమంలో భర్త జేడీ వాన్స్‌తో కలిసి పాల్గొన్న ఉషా వాన్స్.. తన చేతికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని వచ్చింది. ఇది చూసిన వారంతా వీరిద్దరూ విడిపోలేదని.. కలిసే ఉన్నారని భావిస్తున్నారు.
LOVE THIS! JD Vance, joined by his daughter, are currently serving Thanksgiving meals to troops at Fort Campbell.
They’re fired up to see JD, the first Marine to ever serve as Vice President!pic.twitter.com/2gW1mpMVrY
— Ryan Fournier (@RyanAFournier) November 26, 2025
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వివాహ బంధంపై గత కొంతకాలంగా నెట్టింట జరుగుతున్న తీవ్ర చర్చకు తాజాగా తెరపడింది. ఉషా వాన్స్ చేతికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని దర్శనం ఇవ్వడంతో.. ఆమె, జేడీ వాన్స్ విడిపోతున్నారంటూ వస్తున్న వదంతులకు బలమైన సమాధానం లభించింది. నాలుగు రోజుల క్రితమే ఆమె వెడ్డింగ్ రింగ్ పెట్టుకోకుండా బయటకు రాగా.. అంతా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని భావించారు. కానీ తాజాగా అదే ఉంగరం పెట్టుకుని కనిపించి అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.
బుధవారం రోజు ఉపాధ్యక్షుడి కుటుంబం కెంటుకీలో అమెరికా సైనికులతో కలిసి థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జేడీ వాన్స్, ఉషాలతో పాటు వారి ముగ్గురు పిల్లలు కూడా పాల్గొన్నారు. ఉషా వాన్స్, జేడీ వాన్స్ దంపతులు స్వయంగా అమెరికన్ దళాలకు భోజనం వడ్డించారు. వారితో కలిసి అనేక విషయాలు మాట్లాడారు. ఈ హృదయపూర్వక సేవా కార్యక్రమంలో ఉషా వాన్స్ చేతికి మెరిసే వెడ్డింగ్ రింగ్ స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో.. గత కొన్ని వారాలుగా జరుగుతున్న అన్ని రకాల ఊహాగానాలకు, విడాకుల ప్రచారానికి చెక్ పడినట్లు అయ్యింది.
ఉషా వాన్స్ మెరైన్ కోర్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు వివాదం మొదలైంది. ఉత్తర కరోలినాలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి మెరైన్ కోర్ కేంద్రాన్ని ఉషా వాన్స్ సందర్శించారు. ఆ సమయంలో ఆమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేదు. అప్పటికే.. జేడీ వాన్స్ తన భార్య మతం మారుతుందని ఆశిస్తున్నట్లు బహిరంగంగా వ్యాఖ్యానించడం, అలాగే మరో రాజకీయ ప్రముఖుడి సతీమణి ఎరికా కిర్క్‌ను కౌగిలించుకోవడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఉషాకు విడాకులు ఇచ్చి ఆ వెంటనే ఎరికా కిర్క్‌ను జేడీ వాన్స్ పెళ్లాడతారని వార్తలు వచ్చాయి. ఈ అంతర్గత పరిణామాల మధ్య ఉషా వాన్స్ రింగ్ లేకుండా కనిపించడం, ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వివాదంపై వివరణ ఇవ్వడానికి ఉషా వాన్స్ ప్రతినిధి ప్రయత్నించారు. “ఆమె ముగ్గురు చిన్న పిల్లల తల్లి. ఆమె రోజూ అనేక పాత్రలు కడగాల్సి ఉంటుంది. బహుశా అందుకే రింగ్ తీసి ఉంటారు” అని ఆయన పేర్కొన్నారు. సాధారణ గృహిణిగా ఆమె రోజువారీ పనుల ఒత్తిడి కారణంగానే రింగ్ తీసి ఉండవచ్చని, విడాకులకు సంబంధించిన వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని ప్రతినిధి స్పష్టం చేశారు. కానీ ఎవరూ వాటిని నమ్మలేదు. అయితే తాజాగా జరిగిన థాంక్స్ గివింగ్ కార్యక్రమంలో ఉషా వాన్స్ వెడ్డింగ్ రింగ్‌తో కనిపించడం.. వాన్స్ దంపతుల వైవాహిక బంధం దృఢంగా ఉంది అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది.