Iran-Israel : ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ, ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఖొండాబ్ అణు పరిశోధన కేంద్రానికి సమీప ప్రాంతాన్ని గాల్లోంచి మట్టుబెట్టినట్లు కథనాలు చెబుతున్నాయి.
- By Kavya Krishna Published Date - 11:52 AM, Sat - 21 June 25

Iran-Israel : ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మరోసారి సైనిక చర్యకు దిగింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ, ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఖొండాబ్ అణు పరిశోధన కేంద్రానికి సమీప ప్రాంతాన్ని గాల్లోంచి మట్టుబెట్టినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే, రియాక్టర్ సైట్‌ను ముందస్తుగా ఖాళీ చేయించారని, రేడియేషన్ ప్రమాదం లేదని ఇరాన్ అధికారులు ప్రకటించారు.
ఇరాన్ మధ్యప్రాంతంలోని ఖొండాబ్ అణు కేంద్రం పట్ల ఇజ్రాయెల్ గత కొద్ది రోజులుగా తీవ్రంగా సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ కేంద్రం ద్వారా అణు అభివృద్ధి ప్రాజెక్టులకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని భావించిన ఇజ్రాయెల్, అక్కడికి సమీపంగా బాంబుదాడులకు పాల్పడింది. అయితే ఈ దాడులకు ముందు కేంద్రంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో తీవ్ర ప్రమాదం తప్పినట్లు ఇరాన్ అణు శక్తి సంస్థ అధికారులు తెలిపారు.
ఇరాన్‌కు అణు అభివృద్ధిలో కీలకంగా ఉన్న మరో నగరం ఇస్ఫహాన్. ఈ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వ మాధ్యమాలు ధ్రువీకరించాయి. ఈ పేలుళ్లకు కారణాలు ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు కానీ, వీటికి కూడా ఇజ్రాయెల్ హస్తం ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకారం, ఈ దాడుల లక్ష్యం కేవలం అణు పరిశోధనా కేంద్రాలే కాకుండా, మధ్య ఇరాన్‌లోని క్షిపణుల ప్రయోగ స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలనూ లక్ష్యంగా చేసుకుంది. తమ యుద్ధ విమానాలు ఈ కేంద్రాలపై అత్యంత ఖచ్చితంగా దాడులు చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అంతేకాక, ఇరాన్ నుంచి ప్రయోగించిన 15కి పైగా డ్రోన్లను గాలిలోనే సఫలంగా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఈ ఘటనల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణలు కొత్త మలుపు తిరుగుతుండగా, ఇరాన్ ఎలా ప్రతిస్పందించబోతోందన్న ప్రశ్నపై అంతర్జాతీయ దృష్టి నిలిచింది. ఈ దాడులు అణు సామర్థ్యాలను అణచివేత దిశగా భారత్‌తో పాటు ఇతర దేశాల భద్రతా పర్యవేక్షణ సంస్థలు కూడా తమ విశ్లేషణలు ప్రారంభించాయి.
Rakul Preet Singh: ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకున్న రకుల్‌ప్రీత్ సింగ్ దంపతులు