Gaza Ground Attack : గాజాపై గ్రౌండ్ ఎటాక్.. ఇజ్రాయెల్ ఆర్మీకి కీలక మెసేజ్
Gaza Ground Attack : గాజాలోని హమాస్ స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది.
- By Pasha Published Date - 10:18 AM, Fri - 20 October 23

Gaza Ground Attack : గాజాలోని హమాస్ స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. ఇందుకోసం గాజా బార్డర్ లో దాదాపు 3.50 లక్షల మంది ఇజ్రాయెల్ సైనికులు రెడీగా ఉన్నారు. బ్రిటన్, అమెరికాలు ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఇవాళ ఉదయాన్నే గాజా బార్డర్ కు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గలాంట్ వెళ్లారు. ఈసందర్భంగా సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గాజాపై భూమార్గంలో దండయాత్రకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే దీనిపై దీనిపై ఆదేశాలను జారీ చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ‘‘ఇప్పటిదాకా గాజాను బార్డర్ నుంచి చూశాం. త్వరలోనే దాన్ని లోపలి నుంచి చూస్తాం’’ అని ఆయన ఇజ్రాయెలీ సైనికులకు(Gaza Ground Attack) చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
గత రెండువారాలుగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో రక్షణ మంత్రి చేసిన ఈ కీలక ప్రకటనతో యుద్ధం ఇప్పట్లో ముగియకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపైకి లెబనాన్ వైపు నుంచి ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కూడా దాడులు చేస్తోంది. ఇక యెమెన్ లోని హౌతి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సముద్ర తీరంలోని అమెరికా యుద్ధ నౌకలపైకి మిస్సైళ్లు వేస్తున్నారు. ఒకవేళ గాజాలోకి ఇజ్రాయెల్ ఎంటరైతే .. యుద్ధం మరింత విస్తరించి బహుముఖ పోరుకు దారితీసే ముప్పు ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, ప్రస్తుతం జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఈజిప్ట్ పర్యటనలో ఉన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఘోరంగా దెబ్బతిన్న గాజాలోకి మానవతా సహాయాన్ని పంపేందుకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలనే దానిపై వారు చర్చిస్తున్నారు.