మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న ఒత్తిడి?!
యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు.
- Author : Gopichand
Date : 31-03-2026 - 4:23 IST
Published By : Hashtagu Telugu Desk
Iran-US War: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఎదురుదాడులకు ప్రణాళికలు రచించడం కూడా కష్టంగా మారింది. యుద్ధం ప్రారంభమైన గత 4 వారాల్లో ఇరాన్‌కు చెందిన పలువురు అగ్రనేతలు, వారి సహచరులు హతమయ్యారు. ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా భయపడుతున్నారు. తమ సంభాషణలపై నిఘా ఉందన్న ఆందోళనతో, వైమానిక దాడులకు గురవుతామన్న భయంతో వారు ముఖాముఖి భేటీలను కూడా నివారించే పరిస్థితి నెలకొంది.
ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇరాన్‌లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంది. త్వరగా ఒక ఒప్పందానికి రావాలని వారిపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయాధికారం బలహీనపడటంతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావడం కష్టతరమవుతోంది. కొత్త నాయకులకు ఎలాంటి ఒప్పందం చేసుకోవాలి? ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది? అనే విషయాలపై స్పష్టత లేదు. వారు ఎవరి సలహాలు తీసుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు.
Also Read: Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..
ఇరాన్‌పై పెరిగిన ఆర్థిక ఒత్తిడి
యుద్ధం కారణంగా ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగినప్పుడు ఇరాన్ ఒప్పందానికి మొగ్గు చూపవచ్చని కొందరు మాజీ అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ.. త్వరగా ఒప్పందం కుదరకపోతే యుద్ధం మరింత తీవ్రమవుతుందని చెప్పారు. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్ ను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయవచ్చని కూడా ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో మిగిలి ఉన్న నాయకులలో భయం, గందరగోళం పెరిగింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు తమ ఫోన్లు, సందేశాలను ట్రాక్ చేస్తున్నాయని భావించి వారు కాల్స్ చేయడానికి కూడా సాహసించడం లేదు.
అలీ ఖమేనీ మరణం
యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు. కొంతమంది కింది స్థాయి అధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగల సమర్థులైన అనేకమంది ఈ యుద్ధంలో హతమయ్యారని డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. తాజా యుద్ధం ఇరాన్ ప్రభుత్వాన్ని లోపల నుండి బలహీనపరిచింది. ఇది భవిష్యత్తులో మరింత అనిశ్చితికి దారితీస్తోంది.