Iran Vs Sweden : మత గ్రంథం దహనం ఘటన.. 15వేల రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపిన ఇరాన్ : స్వీడన్
2023 జూన్ 28న ఖురాన్‌ను దహనం చేసిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆ మెసేజ్‌లో స్వీడన్ పౌరులను ఇరాన్ ఆర్మీ(Iran Vs Sweden) కోరిందని పేర్కొంది.
- By Pasha Published Date - 05:48 PM, Tue - 24 September 24
Iran Vs Sweden : ఇరాన్‌పై స్వీడన్ సంచలన ఆరోపణలు చేసింది. 2023 జూన్ 28న స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని ఓ మసీదు వద్ద ఇస్లాం పవిత్ర గ్రంథం ప్రతులను ఇరాక్‌కు చెందిన అసిరియన్ శరణార్ధి సల్వాన్ మోమికా దహనం చేసింది. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత.. 2023 ఆగస్టు 1న తమ దేశంలోని పౌరుల ఫోన్లకు 15వేల టెక్ట్స్ మెసేజ్‌లను ఇరాన్ ఆర్మీ పంపిందని స్వీడన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం తమ దేశంలోని ఒక టెలికాం కంపెనీ నెట్ వర్క్‌ను ఇరాన్ ఆర్మీ హ్యాక్ చేసిందని తెలిపింది.
2023 జూన్ 28న ఖురాన్‌ను దహనం చేసిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆ మెసేజ్‌లో స్వీడన్ పౌరులను ఇరాన్ ఆర్మీ(Iran Vs Sweden) కోరిందని పేర్కొంది. ఇలాంటి రెచ్చగొట్టే మెసేజ్‌లను తమ పౌరులకు పంపడం ద్వారా డాటా చట్టాల ఉల్లంఘనకు ఇరాన్ పాల్పడిందని స్వీడన్ పేర్కొంది. ఈ మెసేజ్‌లు అందిన రోజే (ఆగస్టు 1న) స్వీడన్‌లో ఓ వర్గం ప్రజలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేసింది.
‘అంజు టీమ్’ అనే పేరు కలిగిన గ్రూపు నుంచి ఈ మెసేజ్ వచ్చిందని గుర్తించారు. దీనిపై స్వీడన్ ప్రభుత్వం దర్యాప్తును మొదలుపెట్టింది. ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ఆ మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎందుకు పంపారు ? అనే వివరాలను సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. అయితే స్వీడన్‌లోని ఏ టెలికాం కంపెనీ నెట్ వర్క్ ద్వారా ఈ మెసేజ్‌లు ప్రజలకు చేరాయనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఆరోపణలపై ఇరాన్ వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.