US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-06-2026 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి. ప్రస్తుత సాంకేతికతను వాడుకుంటూ పూర్తి డిజిటల్ విధానంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్లు ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక పరిణామంతో ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముగిసి, ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు మార్గం సుగమమైంది. లెబనాన్ సహా మిడిల్ ఈస్ట్‌లోని పలు వివాదాస్పద ప్రాంతాలలో కొనసాగుతున్న అన్ని రకాల మిలిటరీ ఆపరేషన్లను తక్షణమే నిలిపివేయాలని, ఒకరి అంతర్గత విషయాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఇరు పక్షాలు ప్రాథమికంగా అంగీకరించాయి.
60 రోజుల గడువు.. హార్ముజ్ జలసంధి ద్వారా ఉచిత రవాణా!
ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం ప్రకారం, రాబోయే 60 రోజుల్లో పూర్తిస్థాయి శాంతి ఒప్పందానికి సంబంధించిన తుది నిబంధనలను ఇరు దేశాలు ఖరారు చేయనున్నాయి. ఈ డీల్‌లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఎలాంటి అదనపు ఆంక్షలు లేదా ఛార్జీలు విధించకుండా ఉచితంగా అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. దీనివల్ల అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా క్రమబద్ధీకరించబడి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభించనుంది. రెండు అగ్ర దేశాల మధ్య కుదిరిన ఈ శాంతి మార్గం రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి పునాది వేస్తుందని అంతర్జాతీయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.