Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
- Author : Maheswara Rao Nadella
Date : 17-02-2023 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తరలిరాగా, అడ్డుకునేందుకు అప్పటికే వందలామంది ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు, అభిమానులు ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇమ్రాన్ బెయిలును రద్దు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయబోతున్నారన్న వార్త వ్యాపించింది.
ఆ వెంటనే వేల మంది కార్యకర్తలు ఇమ్రాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. జెండాలు ఊపుతూ బ్యానర్లు చూపిస్తే ఇమ్రాన్ అనుకూల నినాదాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇంటివైపుగా కదిలారు. మరికొందరు వాహనాలపై తరలివచ్చారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డుగా ఉంచిన బారికేడ్లను ఎత్తి అవతల పడేశారు. తరలివచ్చిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం.
మరోవైపు, పోలీసు వాహనాలు, ఖైదీలను తరలించే వ్యాన్లు ఇమ్రాన్ నివాసముండే ఖరీదైన జమాన్ పార్కు వైపు సైరన్ల మోత మోగిస్తూ రావడం వీడియోల్లో కనిపించింది. ఇమ్రాన్‌ను కనుక అరెస్ట్ చేయాలని చూస్తే దేశం మొత్తం వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతుందని పీటీఐ నేత ముసారత్ జంషైద్ చీమా హెచ్చరించారు.
పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ గత అక్టోబరులో ఇచ్చిన ‘తోషిఖానా తీర్పు’(విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులను పర్యవేక్షించే విభాగం)పై ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ పాకిస్థాన్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందుకు సంబంధించి పాకిస్థాన్‌పై కేసు నమోదైంది. గతేడాది నంబరులో వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ కారణాలతో ఆయన ప్రస్తుతం ఈ కేసులో బెయిలుపై ఉన్నారు.
కోర్టు ఎదుట హాజరు కావడానికి ఇమ్రాన్‌కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, కానీ ఆయన విఫలమయ్యారంటూ ఇస్లామాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి రజా జవాద్ అబ్బాస్ వ్యాఖ్యానిస్తూ బెయిలు రద్దు చేశారు. గతేడాది జరిగిన దాడి నుంచి ఇమ్రాన్ ఇంకా కోలుకోలేదని, కాబట్టి ఈసారి మినహాయింపు ఇవ్వాలన్న ఇమ్రాన్ తరపు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తిరస్కరిస్తూ మధ్యంతర బెయిలును రద్దు చేశారు.
Also Read: Laser Treatment: గుండె రక్తనాళాల్లో కొవ్వుకు లేజర్ చికిత్స