Hezbollah Vs Israel : ఇజ్రాయెల్‌పై యుద్ధం ఆపేది లేదు.. హిజ్బుల్లా కీలక ప్రకటన
Hezbollah Vs Israel : లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కీలక ప్రకటన విడుదల చేశారు.
- By Pasha Published Date - 08:42 AM, Sun - 12 November 23

Hezbollah Vs Israel : లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కీలక ప్రకటన విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఆపేదాకా.. తాము ఇజ్రాయెల్‌పై అన్ని రకాల ఆయుధాలతో దాడులను చేస్తామని ప్రకటించారు. 300 నుంచి 500 కిలోగ్రాముల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన బుర్కాన్ క్షిపణులను ఇటీవల తాము ఇజ్రాయెల్‌పై ప్రయోగించామని చెప్పారు. ఇజ్రాయెల్‌లోని హైఫా సహా కీలకమైన పలు నగరాల దాకా తమ గూఢచార డ్రోన్లు వెళ్లి వస్తున్నాయని వెల్లడించారు. అమెరికా, బ్రిటన్ మద్దతు వల్లే ఇజ్రాయెల్ ఈ అరాచకం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘1948 నుంచి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగుతోంది. 1982లో లెబనాన్‌లో వేలాది ఇళ్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వేలాది మందిని చంపింది. అయినా లెబనాన్ నుంచి ప్రజా ప్రతిఘటన ఆగలేదు. 2006 యుద్ధంలోనూ లెబనాన్‌లో వేలాదిమందిని ఇజ్రాయెల్ చంపింది. అయినా లెబనీస్ ప్రజలు ప్రతిఘటనను ఆపలేదు’’ అని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చెప్పారు.
మరోవైపు హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఘాటుగా స్పందించారు. ‘‘లెబనీస్ పౌరులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మేం గాజాలో ఏం చేస్తున్నామో.. అదే లెబనాన్ రాజధాని బీరుట్‌లో కూడా చేయగలం’’ అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో గత నెల రోజుల వ్యవధిలో దాదాపు 68 మంది హిజ్బుల్లా మిలిటెంట్లు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో లెబనాన్‌లో దాదాపు 11 మంది సామాన్య పౌరులు మరణించారు. ఇక హిజ్బుల్లా దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఆరుగురు సైనికులు, ఇద్దరు పౌరులు(Hezbollah Vs Israel) మరణించారు.