Russia – Hamas – Iran : బందీలను ఇరాన్‌కు అప్పగిస్తామని ప్రకటించిన హమాస్
Russia - Hamas - Iran : ఇజ్రాయెల్-గాజా యుద్ధం వేళ రష్యా వేదికగా హమాస్ కీలక ప్రకటన చేసింది.
- By Pasha Published Date - 07:36 AM, Fri - 27 October 23

Russia – Hamas – Iran : ఇజ్రాయెల్-గాజా యుద్ధం వేళ రష్యా వేదికగా హమాస్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి తాము కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన బందీలను ఇరాన్‌కు అప్పగిస్తామని వెల్లడించింది. గురువారం రాత్రి ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి అలీ బగిరి కనీతో కలిసి రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్న సీనియర్ హమాస్ సభ్యుడు అబూ మర్జూక్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.
ఎవరెవరు ఏమన్నారు ?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ప్రతినిధి మిఖాయిల్ బొగ్దానోవ్‌తో సమావేశం అనంతరం హమాస్ నేత అబూ మర్జూక్ ఈ ప్రకటన చేశారు. గాజాపై ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండా అని ఆయన తెలిపారు. పాలస్తీనా ప్రజల స్వేచ్ఛా హక్కును ఇజ్రాయెల్ కాలరాయకూడదని, అలా చేస్తే యుద్ధనేరం అవుతుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై రష్యా వైఖరిని హమాస్ నేత అబూ మర్జూక్ ప్రశంసించారు. ఇలాంటి దాడులను ఆపే బాధ్యతను అంతర్జాతీయ సమాజం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీటింగ్ తర్వాత ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి అలీ బగిరి కనీ మాట్లాడుతూ.. బందీలుగా ఉన్న సైనికులు, పౌరులను విడుదల చేసి ఇరాన్‌కు అప్పగించేందుకు హమాస్ సిద్ధంగా ఉందన్నారు.రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ప్రతినిధి మిఖాయిల్ బొగ్దానోవ్ మాట్లాడుతూ.. పాలస్తీనా ప్రజల హక్కుల కోసం తమ దేశం మద్దతుగా నిలుస్తుందన్నారు.అంతకుముందు.. హిజ్బుల్లా, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ చీఫ్‌లు కూడా లెబనాన్ రాజధానిలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో ఇజ్రాయెల్‌పై పూర్తి శక్తితో పోరాడటంపై మూడు సంస్థలు చర్చించినట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ యుద్ధం మంటలు అమెరికానూ వదలవు : ఇరాన్
ఈతరుణంలో అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో రాచుకుంటున్న మంటల నుంచి అమెరికా తప్పించుకోలేదని హెచ్చరించింది. ఈమేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇప్పుడు పాలస్తీనాలో మారణహోమాన్ని నిర్వహిస్తున్న అమెరికన్ రాజనీతిజ్ఞులకు నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించాలని మాకు లేదు. ఒకవేళ గాజాలో మారణహోమం కొనసాగితే, అమెరికా కూడా ఈ మంటల నుంచి తప్పించుకోలేదు’’ అని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ (Russia – Hamas – Iran) పేర్కొన్నారు.