Musk Vs Altman: ఓపెన్ ఏఐను కొనేస్తానన్న మస్క్.. ఎక్స్‌ను కొనేస్తానన్న శామ్ ఆల్ట్‌మన్
ఎక్స్(ట్విట్టర్)ను తమకు అప్పగిస్తే.. ఎలాన్ మస్క్(Musk Vs Altman) చెప్పిన విధంగా రూ.85వేల కోట్లను ఇచ్చేందుకు సిద్ధమని శామ్ ఆల్ట్‌మన్ తేల్చి చెప్పారు.
- By Pasha Published Date - 09:42 AM, Tue - 11 February 25

Musk Vs Altman: ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా పెద్ద సంచలనమే. గతంలో ఆయన ఏకంగా రూ.3.82 లక్షల కోట్లు ఖర్చుపెట్టి మరీ ట్విట్టర్‌ను కొన్నారు. ఇప్పుడు అంతకంటే రెట్టింపు రేటు (రూ.8.46 లక్షల కోట్ల)తో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐను కొనేందుకు మస్క్ రెడీ అయ్యారు. ఛాట్ జీపీటీ.. ఓపెన్ ఏఐ కంపెనీ ప్రోడక్టే. గత కొన్నేళ్లుగా ఓపెన్ ఏఐ కంపెనీ పనితీరును మస్క్ తప్పుపడుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఆయన ఆ కంపెనీని కొనేందుకు సిద్ధమని వెల్లడించారు. ‘‘రూ.8.46 లక్షల కోట్లు ఇస్తాం.. ఓపెన్ ఏఐను మాకు అమ్మేయండి’’ అని మస్క్, బ్యారన్ క్యాపిటల్ గ్రూప్, ఇమాన్యుయెల్ క్యాపిటల్ సహా పలువురు పెట్టుబడిదారులు భారీ ఆఫర్ ఇచ్చారు.
Also Read :Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ
శామ్ ఆల్ట్‌మన్ చురకలు
దీనిపై స్పందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్.. కంపెనీని అమ్మేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తామే ఎక్స్ (ట్విట్టర్)ను కొంటామని చెబుతూ మస్క్‌కు చురకలు అంటించారు. ఎక్స్(ట్విట్టర్)ను తమకు అప్పగిస్తే.. ఎలాన్ మస్క్(Musk Vs Altman) చెప్పిన విధంగా రూ.85వేల కోట్లను ఇచ్చేందుకు సిద్ధమని శామ్ ఆల్ట్‌మన్ తేల్చి చెప్పారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.
Also Read :Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే
xAI కోసమే మస్క్ మాట్లాడుతున్నారా ?
వాస్తవానికి ఓపెన్ ఏఐ కంపెనీని ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్‌లు కలిసి 2015 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పట్లో దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థలా మొదలుపెట్టారు. తదుపరిగా ఓపెన్ ఏఐ కంపెనీగా రిజిస్టర్ చేశారు. రెండేేళ్ల తర్వాత ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి ఎలాన్ మస్క్ బయటికి వచ్చేశారు. 2023లో xAI పేరుతో ఒక ఏఐ టెక్నాలజీ కంపెనీని మస్క్ ప్రారంభించారు. 2024 ఆగస్టులో ఎలాన్ మస్క్ కోర్టును ఆశ్రయించారు. ఓపెన్ ఏఐ కంపెనీ ఏర్పాటైన నాడు జరిగిన ఒప్పందాలను, ప్రస్తుతం ఆ కంపెనీని నిర్వహిస్తున్న వారు ఉల్లంఘిస్తున్నారని మస్క్ ఆరోపించారు. లాభాపేక్ష లేకుండా ఓపెన్ ఏఐ కంపెనీని నడుపుతామని ఒప్పందాల్లో ఉంటే, ఇప్పుడు లాభాల కోసం దాన్ని వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐను లాభాలు ఆశించే సంస్థగా మార్చడాన్ని ఆపుతూ ఆదేశాలు ఇవ్వాలంటూ 2024 నవంబరులో ఎలాన్ మస్క్ మరో పిటిషన్ వేశారు. ఇటీవలే 500 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఏఐ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో ఓపెన్ ఏఐ కంపెనీ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల్లో మస్క్ ఒకరు. అమెరికా ప్రభుత్వంలోని కీలకమైన డోజ్ (DOGE) విభాగానికి సారథిగా మస్క్ వ్యవహరిస్తున్నారు.