War and Business : 100 కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధాలు.. ఏడాదిలో రూ.53 లక్షల కోట్ల బిజినెస్
2023 సంవత్సరంలో రూ.53 లక్షల కోట్ల ఆయుధాల వ్యాపారం(War and Business) చేసిన మొత్తం 100 కంపెనీల్లో 41 అమెరికాలోనే ఉన్నాయి.
- By Pasha Published Date - 12:21 PM, Mon - 2 December 24

War and Business : ఓ వైపు పశ్చిమాసియా ప్రాంతంలో గాజా- లెబనాన్- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అల్లాడింది. చాలా దేశాల్లో వంట నూనెల నుంచి పెట్రోలు, డీజిల్ దాకా.. బంగారం నుంచి ఇతర నిత్యావసరాల దాకా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. ఆయా దేశాల ప్రజానీకం జీవితం భారంగా మారింది. లెబనాన్, గాజా, ఇజ్రాయెల్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయితే గత ఏడాది వ్యవధిలో 100 ఆయుధ కంపెనీల ఆదాయాలు, లాభాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ కంపెనీల నుంచే ఆయా దేశాలకు ఆయుధాలు సప్లై అయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలతో ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ’(SIPRI) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.
Also Read :Biden Pardons Son : తండ్రిగా, దేశాధ్యక్షుడిగా జో బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష
సిప్రి నివేదిక ప్రకారం..
- ప్రపంచంలోని 100 ఆయుధ కంపెనీలు 2023లో రూ. 53 లక్షల కోట్లు విలువైన వ్యాపారం చేశాయి. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం.
- ఈ ట్రెండ్ 2024లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర కొరియా – దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. చైనా పొరుగు దేశం తైవాన్‌కు అమెరికా భారీగా ఆయుధాలను అందిస్తోంది.
- 2023 సంవత్సరంలో రూ.53 లక్షల కోట్ల ఆయుధాల వ్యాపారం(War and Business) చేసిన మొత్తం 100 కంపెనీల్లో 41 అమెరికాలోనే ఉన్నాయి. ఇవి ఆయుధ విక్రయాల్లో 2.3 శాతం వృద్ధిని సాధించాయి.
- 2023 సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ కంపెనీలైన లాక్‌హీడ్ మార్టిన్ ఆదాయం 1.6 శాతం, రేథియాన్ టెక్నాలజీస్ ఆదాయం 1.3 శాతం మేర తగ్గింది. ఎందుకంటే ఇవి తయారుచేసే అత్యాధునిక ఆయుధాలు, సైనిక సామగ్రి విక్రయాల కోసం తొలుత అమెరికా రక్షణ శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ. అనుమతులు లభించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంటుంది. అందుకే వీటి ఆదాయాలు మిగతా ఆయుధాల కంపెనీల్లా పెరగలేదు.
- ఐరోపా దేశాల్లోని 27 ఆయుధ కంపెనీలు కూడా 0.2శాతమే వృద్ధిని సాధించాయి.
- రష్యాలోని ఆయుధ కంపెనీలు సగటున 40 శాతం వృద్ధిని సాధించాయి. రష్యా ప్రభుత్వానికి చెందిన రోస్‌టెక్ కంపెనీ ఆదాయం 49 శాతం పెరిగింది.
- 2023లో ఇజ్రాయెల్‌లోని మూడు ఆయుధ కంపెనీలు రికార్డు స్థాయిలో రూ.లక్ష కోట్ల సేల్స్‌ను సాధించాయి.
- 2023లో టర్కీలోని డ్రోన్ల తయారీ కంపెనీ బేకర్ వ్యాపారం 24శాతం వృద్ధి చెందింది.
- 2023లో చైనాకు చెందిన ఆయుధాల కంపెనీలు దాదాపు రూ.8 లక్షల కోట్లు విలువైన వ్యాపారం చేశాయి.